logo

ఏం చేశావ్‌ మేలు... కౌలు రైతు కుదేలు..!

జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.

Updated : 20 Apr 2024 05:22 IST

హామీల అమలులో జగన్‌ సర్కారు ఘోర వైఫల్యం
న్యూస్‌టుడే, కడప, రాజంపేట గ్రామీణ]

‘కౌలు రైతులను ఆదుకుంటాం....                  
సాగుహక్కు పత్రాలు అందజేస్తాం...                          
బ్యాంకుల్లో వడ్డీలేని రుణాలిస్తాం... రాయితీపై
విత్తనాలు పంపిణీ చేస్తాం...ఎరువులు, సూక్ష్మ
పోషకాలు సరఫరా చేస్తాం... ప్రకృతి
విపత్తులతో పంట దెబ్బతింటే నష్టపోతే పెట్టుబడి రాయితీ చెల్లిస్తాం... బీమా ధీమా కల్పిస్తాం’ ఇదీ సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు. వైకాపా అధికారంలోకొచ్చాక వాటిని  అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మొక్కుబడిగా గుర్తింపు కార్డులిచ్చారు. పట్టుమని 10 శాతం మందికి కూడా ఊరట లభించలేదు  సరికదా లబ్ధి చేకూరలేదు. జగన్‌ ఒట్టి మాటలతో         ఊరించి ఉసూరుమనించారు.

జిల్లాలో 4,88,672 మంది రైతులుండగా, పంటలు సాగు చేసే నికర భూమి 2,70,985 హెక్టార్లు ఉంది. సొంత పొలం లేని 50 వేల మందికి పైగా కౌలురైతులు సొంతూర్లు, ఇతర ప్రాంతాల్లో మిగతా సాగు దారులకు చెందిన భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణం నుంచి పదెకాల విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారు. వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఏపీ పంటల సాగు హక్కు చట్టం-2019కు శ్రీకారం చుట్టి పంట సాగు హక్కు ప‌్రత్రాలు కార్డులివ్వాలని నిర్ణయించింది. రెవెన్యూ, వ్యవసాయ, అనుబంధ శాఖల పర్యవేక్షణలో కౌలురైతుల గుర్తింపు మొక్కుబడిగా సాగుతోంది. గతంలో మాదిరిగా పత్రం ముద్రించి ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో పత్రాన్ని తీసి ఇస్తున్నారు. అనంతరం అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అధికారికంగా ధ్రువీకరించి అందజేయాలని ఆదేశించారు. ఒక్కసారి తీసుకుంటే 11 నెలల పాటు చెల్లుబాటయ్యేలా గడువిచ్చారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే ఇస్తున్నారు. చాలామంది కౌలుదారులకు హక్కుపత్రాలు ఇవ్వడానికి సహకారం అందించలేదు. ఈ కారణంతో 12 వేల మందికి కూడా కొత్తగా పత్రాలివ్వలేదు. పాత కార్డుల నవీకరణకు చాలామంది ముందుకు రాలేదు. పత్రం ఉన్నా ఎలాంటి ప్రయోజనాలు కలగకపోవడంతో పునరుద్ధరణకు ముందుకు రావడంలేదు.

నా పేరు భూపల లక్ష్మీనారాయణ. మాది ఒంటిమిట్ట మండలం గుంటికాడిపల్లె. గత ఎనిమిదేళ్లుగా ఆరెకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంట సాగుహక్కు పత్రమివ్వాలని అధికారులను అడిగితే పలకడంలేదు. గుర్తింపు కార్డు లేదని రాయితీపై విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు, రుణాలు ఇవ్వడంలేదు. ప్రకృతి విపత్తులతో పంటలు దెబ్బతిన్నా నష్టపరిహారం ఇవ్వడంలేదు.

పెట్టుబడి భారం...

జిల్లాలో ఉద్యాన తోటలను విస్తారంగా సాగుచేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, పూలు, ఆకుతోటలు అధికంగా పండిస్తున్నారు. సున్నిత పంటలు కాగా, పైగా పెట్టుబడి ఎక్కువే. రానురాను సాగు ఖర్చులు పెరుగుతుండడం కౌలుదారులపై పెనుభారం పడుతోంది. ప్రైవేటు వ్యాపారుల వద్డ వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పంటలేస్తున్నారు. కాలం కలిసి రాక, ప్రకృతి ప్రకోపం, తెగుళ్లు, పురుగుల దాడితో తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిసార్లు కనీసం ఖర్చులు కూడా దక్కడం లేదు. సీఎం జగన్‌ పాలనలో కనీసం పరిహారం కూడా అందలేదు. పంటల బీమా కూడా ఇవ్వడం లేదు. ఈ-పంట నమోదుకు అనుమతి లభించకపోవడంతో బీమా, పరిహారం దక్కని దయనీయ పరిస్థితి నెలకొంది.


రుణ భాగ్యమేదీ?...

పంట రుణాలిస్తామని ప్రచారార్భాటం చేసినా అతి తక్కువ మందికే బ్యాంకర్లు ఇచ్చారు. ఖరీఫ్‌, రబీలలో బ్యాంకుల ద్వారా రైతులకు పెద్దఎత్తున రుణాలివ్వాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. వీరిలో కౌలురైతులకు కనీసమంటే 10 శాతం ఇవ్వాల్సి ఉండగా, 2 నుంచి 5 శాతానికి మించి ఇవ్వడం లేదు. అప్పు తీసుకుని తిరిగి సకాలంలో చెల్లించపోయినా, ఎగ్గొట్టినా భారం తమపై పడుతుందని భూమి కౌలుకిచ్చిన రైతులు భయపడుతున్నారు. బ్యాంకుల్లో అప్పు తీసుకోవాలని ఆశించిన వారికి భంగపాటు తప్పడం లేదు. గుర్తింపు పత్రం పొందిన తర్వాత కాల పరిమితి కేవలం 11 నెలలు ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన వారు భూ యజమాని అనుమతి పొంది నవీకరించుకుంటేనే చెల్లుబాటు అవుతోంది. లేదంటే లేదు.


మాటలకే పరిమితం

ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు అసలు పొంతనే ఉండడం లేదు. మేలిమి విత్తనాల పంపిణీ మాటలకే పరిమితమైంది. రసాయన, సేంద్రియ సత్తువలు రాయితీపై ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం మంగళం పాడేసింది. రైతు భరోసా సాయం భాగ్యం దక్కడం లేదు. సరళతర విధానాలు అమలు చేయాలని అడుగుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం జగన్‌ ఏలుబడిలో కౌలుదారులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆపన్నహస్తం మాటే లేదు. దేవదాయశాఖ పర్యవేక్షణలోని ఆలయ మాన్యాల భూములను కౌలుకు ఇస్తున్నారు. వీరికి కూడా ఎలాంటి పత్రాలివ్వడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు