logo

జనంపై జగనాసురుడి దండయాత్ర!

జగన్‌ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు.

Updated : 20 Apr 2024 05:12 IST

వైకాపా పాలనలో ఎంతో మంది బాధితులు
భూములు కోల్పోవడమే కాక ప్రాణాలు బలి
తప్పుడు కేసులు బనాయిస్తూ అరాచక పర్వం
-ఈనాడు, కడప, రాజంపేట గ్రామీణ, ఖాజీపేట, ప్రొద్దుటూరు, రాయచోటి, సిద్దవటం

'

గన్‌ అయిదేళ్ల పాలనలో ఊరికో అసురుడు తయారయ్యాడు... కనిపించిన భూములన్నింటికీ కబ్జా చేశారు... సహజ వనరులను ఇష్టారీతిన కొల్లగొట్టారు... తమ ఆగడాలపై ప్రశ్నించినవారిపై దాడులకు తెగబడ్డారు... హత్యలకు సైతం వెనకాడలేదు. అధికారం మాదంటూ అడ్డగోలుగా వ్యవహరించారు. బాధితులకు న్యాయం జరగకపోగా ఎదురు కేసులు పెట్టి మరీ హింసించారు. కొందరు అధికారులు సైతం తామేమి తక్కువ కాదంటూ అధికార పార్టీ నేతలతో అంటకాగారు. వైకాపా సర్కారు పాపంలో పాలుపంచుకున్నారు. ఇలా జగన్‌  అరాచక పాలనలో ఎన్నో ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

దళిత అధికారి అచ్చెన్న హత్య

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప పశుసంవర్థకశాఖ డీడీ అచ్చెన్న హత్య కిరాతకంగా జరిగింది. కడప నగర నడిబొడ్డు నుంచి కిడ్నాప్‌ చేసి చంపేయడంతో పాటు గువ్వలచెరువు కనుమ రహదారిలో గోడకింద పడేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదు. పశువుల కాపర్లు మృతదేహాన్ని గుర్తించడంతో ఘటన జరిగిన వారం తర్వాత వ్యవహారం బయటపడింది. సీఎం జగన్‌ సొంత జిల్లాలో ఓ దళిత అధికారికి రక్షణలేకుండా పోయింది. కేసును నామమాత్రంగా ముగ్గురు వ్యక్తులపై నెట్టేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. గతేడాది మార్చిలో జరిగిన ఘటనపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.


మూడేళ్లుగా అలుపెరగని పోరాటం

సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామానికి చెందిన మామిళ్ల శివ భూములను వైకాపా నేతలు బలవంతంగా లాక్కున్నారు. భూములు తమకు విక్రయించాలని ఒత్తిడి చేయగా యజమాని ఒప్పుకోలేదు. చివరకు పోలీసుల ద్వారా తమ ప్రతాపం చూపించి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించడంతో పాటు కొట్టించారు. ఇలా భయభ్రాంతులతో రూ.10 కోట్ల విలువైన రూ.16.50 ఎకరాల భూముల్ని రాయించుకున్నారు. మూడేళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం జరగలేదు.


బాధితురాలి గోడుపట్టని వైకాపా సర్కారు

రాయచోటి మండలం వరిగ పాపిరెడ్డిగారిపల్లిలో 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గ్రామానికి చెందిన పుల్లమ్మ భూమిపై వైకాపా నాయకులు కన్నేశారు. రాయచోటి పట్టణ సమీపంలో 4.30 ఎకరాల భూమిని పుల్లమ్మ కుటుంబీకులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం డీకేటీ భూముల పట్టాలు జారీ చేసే సమయంలో పుల్లమ్మ భూమిని స్థానికంగా ఉన్న వైకాపా కౌన్సిలర్‌ ఒకరు తన బంధువుల పేర్లపై పట్టా చేసుకునేందుకు భూమిని ఆక్రమించి దస్త్రాలు సిద్ధం చేశారు.  తమది పేద కుటుంబమని 35 ఏళ్లుగా సాగుబడిలో ఉన్న భూమిని తమకే పట్టాలివ్వాలని అప్పటి కలెక్టర్‌ గిరీషకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి గోడు సీఎం కార్యాలయం వరకు వెళ్లినా న్యాయం జరగలేదు.


భర్త మరణంతో ఆమె జీవితం దుర్భరం

ఈమె పేరు సుజాత. ఖాజీపేట మండలం తుడుములదిన్నె. వీరిది వ్యవసాయ కుటుంబం. భర్త రైతు వెంకటసుబ్బారెడ్డి మరణంతో ఆమెను కష్టాలు చుట్టుముట్టాయి. పిల్లలను చదివించుకునేందుకు పొలం వదిలి వ్యవసాయ కూలీగా మారారు. అప్పుల బాధ తాళలేక భర్త తాను సాగుచేస్తున్న పొలంలోనే పురుగుల మందు తాగి తనువు చాలించాడు. వారసత్వంగా తనకు వచ్చిన 1.54 ఎకరాల చుక్కల భూమిని ఆన్‌లైన్‌ చేయించుకునే క్రమంలో అధికారుల అలసత్వానికి బలై బలన్మరణం చెందారు. తన మరణానికి సీఎం జగన్‌, రెవెన్యూ అధికారులేనని, తనకున్న చుక్కల భూమిని పట్టా చేసి ఇవ్వాలని లేఖ రాసి తనువు చాలించారు. పంట అప్పులపాల్జేస్తే అధికారులు ఏకంగా రైతు ప్రాణాన్నే బలితీసుకున్నారు. భర్త మరణానంతరం ప్రభుత్వం తరఫున అందాల్సిన పరిహారం సైతం అందలేదు. ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని అప్పటి ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి.


కాళ్లరిగేలా తిరుగుతున్నా జరగని న్యాయం

రాజంపేట మండలం మదనగోపాలపురం ఎస్సీ కాలనీకి చెందిన పిల్లి విజయమ్మకు తాళ్లపాకలో సర్వే సంఖ్య 1243-2లో 1.50 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. ప్రస్తుతం దీని విలువ పెరగడంతో వైకాపా నేతల కన్నుపడింది. బాధితురాలు విజయమ్మ తన భర్త గురయ్యతో పొలంలో సాగు చేయడానికి¨ వెళ్లగా, సర్వే అధికారి మద్దతుతో అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. బాధితులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా న్యాయం జరగడంలేదు. కలెక్టర్‌ స్థాయిలో ఆదేశించినా రెవెన్యూ అధికార యంత్రాంగం స్పందించడంలేదు.


వైకాపా నేతల దురాక్రమణ

- ఇరగనబోయిన లక్షుమ్మ, రాణి

దనగోపాలపురం ఇందిరమ్మ కాలనీలో సర్వే సంఖ్య 1171లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారు. దీనిని బోయనపల్లికి చెందిన వైకాపా నేత వీరయ్య ఆక్రమించుకున్నారు. ఆయన  నిర్ణయించిన ధరకు మా భూమి ఇవ్వలేదని దౌర్జన్యంగా కబ్జా చేసి భవన నిర్మాణం చేపట్టారు. మాకు జరిగిన అన్యాయం, దౌర్జన్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పలితం లేకపోయింది.  


ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు

- మహేష్‌, బాధితుడు, మూలవారిపల్లి, ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురంలో సర్వే సంఖ్య 102/2బిలో 4.36 ఎకరాల భూమి మా తండ్రి ఆకుమల్ల ప్రభుదాసుకు చెందింది. దీనిని రెవెన్యూ అధికారులు మేడిగ జయరాజుదేనని అనుభవ పత్రాలిచ్చి 1బి అడంగల్‌ ఎక్కించారు. మావద్దనున్న భూమి పత్రాలతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి అండతో అక్రమార్కులు నిర్మాణాలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని