logo

ఏడాది అన్నావ్‌... ఎడారి చేశావ్‌...!

‘అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరదలకు తెగిపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. రాజంపేట నియోజకవర్గానికి సాగు, తాగునీరందిస్తున్న జలాశయాన్ని ఏడాదిలోనే మరో ఏడు టీఎంసీˆలు నీరు నిల్వ ఉండే విధంగా పునర్నిర్మిస్తాం’ అని జలాశయం కట్ట తెగిన సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

Updated : 05 May 2024 05:36 IST

కలగా మిగిలిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం
అన్నదాతలను నిలువునా మోసగించిన సీఎం జగన్‌
ఎటుచూసినా బీడు భూములు, ఎండిన బోర్లే దర్శనం

వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్‌ ... 

‘అన్నమయ్య జలాశయం మట్టికట్ట వరదలకు తెగిపోవడం బాధాకరం. నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తాం. రాజంపేట నియోజకవర్గానికి సాగు, తాగునీరందిస్తున్న జలాశయాన్ని ఏడాదిలోనే మరో ఏడు టీఎంసీˆలు నీరు నిల్వ ఉండే విధంగా పునర్నిర్మిస్తాం’ అని జలాశయం కట్ట తెగిన సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన మాటిచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంతవరకు ఎలాంటి మరమ్మతులకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం : 2.23 టీఎంసీˆలు రాజంపేట, పుల్లంపేట మండలాల్లో 24 వేల ఎకరాలకు సాగునీరు

  • రాజంపేట పట్టణం, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలకు తాగునీరు
  • జలాశయం ప్రధాన కాలువ నుంచి ఆకేపాడు, హస్తవరం, మన్నూరు,  కూచివారిపల్లె, పోలి చెరువులకు నీరు

న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ

  • * రెండున్నరేళ్ల కిందట అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిపోవడంతో పెను విధ్వంసం చోటుచేసుకుంది. జలవిలయంలో 39 మంది మృతిచెందగా, వందలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. వైకాపా ఏలుబడిలో తమకు మేలు జరుగుతుందని ఆశించిన బాధితులకు చివరకు కన్నీరే మిగిలింది. సీఎం జగన్‌ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో బాధితులందరికీ వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా, ఇంతవరకు నెరవేరలేదు. దీంతో అప్పట్లో వ్యవసాయం చేసుకుంటూ పలువురికి కూలీలకు ఉపాధి కల్పించిన రైతులు ప్రస్తుతం కూలీలుగా మారి దయనీయ పరిస్థితుల్లో జీవితాలు అనుభవిస్తున్నారు.
  • ప్రస్తుతం జలాశయంలో చుక్కనీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పొలాల్లోని బోర్లు ఒట్టిపోయాయి. ఉద్యాన పంటలకు సాగునీరందక బీడుగా మారాయి. ఏళ్లుగా పెంచుకున్న ఉద్యాన తోటలకు కాపాడుకోలేక పొలాల్లోనే వదిలేయాల్సి వస్తోందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
  • రాజంపేట నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాలల్లో సాగులో ఉన్న అరటి తోటలకు నీరందక దెబ్బతినడంతో వదిలేశారు. ఒక్క ఎకరా అరటి తోటను సాగు చేయాలంటే రైతుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన రెండు వేల ఎకరాలకు రూ.16 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు. జలాశయం పునర్నిర్మించకపోతే ఊళ్లు ఖాళీ చేసి వలసబాట పట్టాల్సిందేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు

నాలుగెకరాల్లో అరటి తోట సాగు చేశాను. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాత బోర్ల నుంచి నీరు రావడంలేదు. కొత్తగా రూ.4.5 లక్షలు అప్పు చేసి నాలుగు బోర్లు వేయించినా చుక్క నీరు కూడా పడలేదు. దీంతో తోటలోనే పంటంతా ఎండిపోవడంతో మరో రూ.4 లక్షల నష్టం వాటిల్లింది. అన్నమయ్య జలాశయంలో నీరు ఉంటే మాకీ బాధలు తప్పేవి.

నరసింహులు, కటారుపల్లి

వైకాపా పాలనలో వీధిన పడ్డాం

పంట చేతికొచ్చే సమయంలో నీరందక పంటలు ఎండిపోయాయి. నాలుగెకరాల్లో అరటి సాగు చేస్తే రూ.4 లక్షల నష్టం వచ్చింది. మా గ్రామంలోని రైతులందరిదీ ఇదే దుస్థితి. కుటుంబం గడవడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. సీఎం జగన్‌ హామీ ఇచ్చినా జలాశయ నిర్మాణానికి మాత్రం అడుగులు పడలేదు.

వెంకటేశ్వర్లు, బ్రాహ్మణపల్లి

అప్పులు మిగిలాయి

మానవ తప్పిదంతోనే అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగిపోయింది. పాలకులు, అధికారులు మాకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టారు. జలాశయంలో నీరు లేకపోవడంతో 10 పంచాయతీల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అరటి తోటలో గెలలు వచ్చినా నీరందక ఎండిపోయింది. సాగుకు చేసిన అప్పులు మాత్రం మిగిలాయి.

సుబ్రహ్మణ్యంనాయుడు. బ్రాహ్మణపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని