logo

ఆనందం ఆవిరి!

మరో 18 నెలలు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యమంత్రిగా ఉంటానని కలలుగన్న ఆనంద్‌సింగ్‌కు చుక్కెదురైంది. నిరుడు హొసపేటెలో పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా బాధ్య మంత్రి హోదాలో జెండా ఎగురవేసిన ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైంది. ఈ పరిణామం

Published : 28 Jan 2022 01:29 IST

హొసపేటెలో బాధ్య మంత్రి హోదాలో పాల్గొన్న మంత్రి ఆనంద్‌సింగ్‌

హొసపేటె, న్యూస్‌టుడే: మరో 18 నెలలు బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్యమంత్రిగా ఉంటానని కలలుగన్న ఆనంద్‌సింగ్‌కు చుక్కెదురైంది. నిరుడు హొసపేటెలో పంద్రాగస్టు వేడుకల్లో జిల్లా బాధ్య మంత్రి హోదాలో జెండా ఎగురవేసిన ఆనందం ఆరు నెలల్లోనే ఆవిరైంది. ఈ పరిణామం కార్యకర్తలకు మింగుడు పడటంలేదు. మంత్రి ఆనంద్‌సింగ్‌కి కూడా ఇది అనుకోని కుదుపే. ఈ నిర్ణయంపై ప్రతికూలంగా వ్యాఖ్యానిస్తే, ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఆరు తాలూకాలతో కూడిన విజయనగరను బళ్లారి నుంచి వేరు చేసి, ఆ జిల్లాకు బాధ్యమంత్రిగా ఉండాలన్న ఆకాంక్షతో 2019లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆనంద్‌సింగ్‌ అదే ఏడాది భాజపా నుంచి గెలిచి మంత్రిగా, బళ్లారి జిల్లా బాధ్యత కూడా చేపట్టారు. ముఖ్యమంత్రి యడియూరప్పను ఒప్పించి 2020లో విజయనగర జిల్లాను ప్రకటింపజేశారు. కరోనా అడ్డురావడంతో జిల్లా ఏర్పాటు కొంత ఆలస్యమైంది. 2021లో డీసీ, ఎస్పీ, జడ్పీ సీఈవోలను నియమింపజేశారు. ఆయన బళ్లారి జిల్లా బాధ్య మంత్రిగా ఉండటాన్ని బళ్లారి నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీరాములుకు బళ్లారి జిల్లా బాధ్యత అప్పగించాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆనంద్‌సింగ్‌కు కూడా విజయనగర జిల్లాకు బాధ్యుడిగా ఉండటమే ఇష్టంగా ఉండేది. రెండు జిల్లాలకు బాధ్య మంత్రిగా ఉన్నప్పటికీ 2021 ఆగస్టు 15న కొత్త జిల్లా విజయనగరలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబరులో ముఖ్యమంత్రిని ఆహ్వానించి, అధికారికంగా జిల్లా ప్రకటన చేయించారు. జిల్లా ఏర్పాటు సహా ఆరు తాలూకాల్లో భాజపా బలోపేతానికి కసరత్తు ప్రారంభించారు. వచ్చే విధానసభ ఎన్నికల్లో విజయనగర జిల్లాలోని ఆరు స్థానాలను గెలుచుకోవాలని వ్యూహరచన ప్రారంభించారు. జనవరి 26న గణతంత్ర వేడుకల్లో మరోసారి విజయనగర జిల్లా కేంద్రం హొసపేటెలో బాధ్యమంత్రి హోదాలో జెండా ఆవిష్కరిస్తానని కలలుగన్నారు. వేడుకలకు రెండు రోజుల ముందు ఆనంద్‌సింగ్‌ పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. జిల్లాల బాధ్య మంత్రులను మారుస్తూ, ఆయన్ను కొప్పళ జిల్లాకు నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడంతో సింగ్‌ తీవ్ర నిరాశకు గురయ్యారనే చెప్పాలి. విజయనగర జిల్లా బాధ్యమంత్రిగా నియమించిన శశికళా జొల్లెకి కరోనా సోకడంతో ఆమె కూడా వేడుకల్లో పాల్గొనలేదు. ఈ పరిణామాలను ఇప్పటికీ మంత్రి అనుచరవర్గాలు జీర్ణించుకోవడం లేదు. ఆయన్ను జిల్లా బాధ్యత నుంచి తప్పించడంతో రూ.240 కోట్లతో ఎత్తిపోతల పథకం, రూ.40 కోట్లతో జోళదరాశి కొండ ఆధునికీకరణ, రూ.500 కోట్లతో జిల్లా పూర్తిస్థాయి ఏర్పాటు పనులకు ఆటంకం కలుగుతుందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. వీటిని మంత్రి ఆనంద్‌సింగ్‌ కొట్టి పారేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని