నవరత్నాల నయవంచన

సీఎం అధికారిక ఛాంబర్‌కు వచ్చిపోయే దారిలో నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేమ్‌లు కట్టించి గోడలకు దిగ్గొట్టించింది జగన్‌ సర్కారు! వాగ్దానాల అమలుకోసం ఇప్పటికి 124సార్లు బటన్‌ నొక్కానన్న జగన్‌ అయిదేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌పై తనకు తానే 99శాతంపైగా మార్కులు వేసేసుకున్నారు. చెప్పినవి చెయ్యకపోగా చెప్పుకోలేనివి లెక్కలేనన్ని చేసిన జగన్‌- నవరత్నాల్ని నమ్మిన అశేష జనావళిని నిలువునా ముంచేశారు.

Published : 10 Apr 2024 00:43 IST

సీఎం అధికారిక ఛాంబర్‌కు వచ్చిపోయే దారిలో నవరత్నాల్లోని అంశాలన్నింటినీ ఫ్రేమ్‌లు కట్టించి గోడలకు దిగ్గొట్టించింది జగన్‌ సర్కారు! వాగ్దానాల అమలుకోసం ఇప్పటికి 124సార్లు బటన్‌ నొక్కానన్న జగన్‌ అయిదేళ్ల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌పై తనకు తానే 99శాతంపైగా మార్కులు వేసేసుకున్నారు. చెప్పినవి చెయ్యకపోగా చెప్పుకోలేనివి లెక్కలేనన్ని చేసిన జగన్‌- నవరత్నాల్ని నమ్మిన అశేష జనావళిని నిలువునా ముంచేశారు. ఎంతోకాలంగా అమలవుతున్న వాటిని అర్ధాంతరంగా ఆపేసి, పాత పథకాలకు వైకాపా వెల్లవేసి నవరత్నాలుగా జనం మీదకు వదిలారు. ప్రతిరైతు కుటుంబానికీ పెట్టుబడి సాయంగా ఏటా రూ.12,500 ఇస్తామన్న జగన్‌- పీఎం కిసాన్‌ యోజన ద్వారా ఏటా వచ్చే రూ.6000 మొత్తాన్నీ అందులో కలిపేసి వంచనకు పాల్పడ్డారు. పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత కరెంటు, రూ.3000కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4000కోట్లతో విపత్తుల సహాయక నిధి అంటూ బూటకపు వాగ్దానాలతో అన్నదాతను మభ్యపెట్టారు. వాగ్దానాల మేరకు- శీతల గిడ్డంగులు లేవు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లూ కానరావు. భవిష్యత్తుపై రైతుకు భరోసా లేకుండా చేసిన జగన్‌- ఆరోగ్యశ్రీని అస్వస్థతకు గురిచేసి అనారోగ్య పీడితుల్నీ వంచించారు. చికిత్స వ్యయ పరిమితిని రూ.25లక్షలకు పెంచామంటున్న జగన్‌- ఆసుపత్రులకు బిల్లులు బకాయి పెట్టి ఆరోగ్యశ్రీ సేవలకు గండికొట్టారు! అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తిఫీజు తిరిగి చెల్లిస్తున్నామంటూ దానికి పెట్టిన పేరు- విద్యాదీవెన. ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సులకు 2020-21 నుంచి బోధన రుసుముల చెల్లింపు పథకాన్ని నిలిపేసిన ప్రభుత్వం అప్పటికి చెల్లించాల్సి ఉన్న రూ.450కోట్లకు ఎగనామం పెట్టింది. బాలింతలకు ఆసరా లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూతా కరవు. అయినా అందరి కళ్లల్లో ఆనందం అంటూ- ఒకటే దరువు!

‘చదువుతోనే సామాజిక హోదా, ఆర్థిక ప్రగతి... ఆ రెండింటినీ సాధించాలన్నదే అమ్మఒడి లక్ష్యం’ అన్న జగన్‌- పేదల బతుకులతో భ్రమల సాగు చేశారు. కళాశాలల్ని పక్కనపెట్టి తల్లిదండ్రులు విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లోకే రీయింబర్స్‌మెంట్‌ జమ అయ్యేలా చూడటంతో సమస్యలు ముసురుకున్నాయి. జగన్‌ బటన్‌ నొక్కుళ్లేగాని డబ్బులు జమకాని పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి పేదకుటుంబాలు భరించిన ఫీజుల భారం రూ.3000కోట్లు! వసతి దీవెన పేరిట చేస్తానన్న సాయమూ అటకెక్కి నిరుపేద విద్యార్థులు బిక్కచచ్చిపోయారు. ‘రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలన్నది నా కసి’ అన్న జగన్‌ అందుకు ఎంచుకొన్న పంథా లక్షల కుటుంబాల్ని చిదిమేసింది. మద్యపాన నియంత్రణ కోసమంటూ లిక్కరు ధరలకు రెక్కలు తొడిగి, అడ్డమైన బ్రాండ్లనూ జనం మీదకు వదిలిన జగన్‌ పాపం అభాగ్యులపాలిట మహాశాపమైంది. ఒక్క అనంతపురం సర్వజన ఆసుపత్రిలోనే మూడేళ్లకాలంలో 5093మంది మృత్యువాతపడ్డారు. నాసిరకం మద్యం నిరుపేదల్ని బలిగొంటుంటే, ఆ శవాల మీద కాసుల పేలాలు ఏరుకుంటోంది జగన్‌ సర్కారు! జలయజ్ఞాన్ని అస్మదీయ గుత్తేదారులకు కామధేనువుగా మార్చేసిన జగన్‌ ప్రభుత్వం- ఏపీకి జీవనాడి లాంటి పోలవరాన్ని పూర్తిచేయడంపై ఎన్నిసార్లు నాలుక మడతేసిందో లెక్కేలేదు. జలయజ్ఞాన్నే కాదు, జగనన్న కాలనీలనూ నీరుగార్చేసిన ఈ సర్కారు పేద ప్రజల సొంతింటి కలల్ని నిలువునా కూల్చేసింది. మొత్తం దాదాపు రూ.51,000కోట్లతో 17వేల జగనన్న కాలనీల్లో 28,38,227 గృహాల్ని రెండు దశల్లో నిర్మిస్తామంటూ చేసిన ఆర్భాటానికి- క్షేత్రస్థాయి వాస్తవాలు గాలి తీసేస్తున్నాయి. తెదేపా హయాములో దాదాపు పూర్తి అయిన టిడ్కో ఇళ్లనూ పాడుపెట్టి బూత్‌బంగ్లాలుగా మార్చేసిన రాక్షస రాజ్యమిది. పింఛను పథకాన్ని, వాలంటీర్లతో ముడిపెట్టి జగన్‌ ఆడిన క్షుద్ర రాజకీయ విన్యాసంలో పలు పండుటాకులు నేలరాలిపోయాయి. నత్తగుల్లల్లాంటి పథకాల్నే నవరత్నాలుగా బులిపించిన జగన్‌- లబ్ధిదారులంతా మళ్ళీ తనకే ఓటెయ్యాలంటున్నారు. జనాన్ని మూగపావులుగా జమకట్టి జగన్‌ ఆడుతున్న కపటనాటకానికి తెరదించేలా రెండు బటన్లు నొక్కే సదవకాశం ఓటర్ల తలుపు తడుతోందిప్పుడు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.