icon icon icon
icon icon icon

tharoor: ‘400 సీట్లు జోక్‌.. 300 అసాధ్యం.. 200 సవాలే’: భాజపాపై శశిథరూర్‌ విమర్శలు

సార్వత్రిక ఎన్నికల్లో 400లకుపైగా స్థానాల్లో గెలుస్తామని భాజపా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు.

Published : 03 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) భారీ మెజార్టీతో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని భాజపా చేసుకుంటున్న ప్రచారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా 400కు పైగా స్థానాల్లో గెలుస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. 300 సీట్లు అసాధ్యమేనని, కనీసం 200కు పైగా స్థానాల్లో గెలవడం భాజపాకు సవాలుతో కూడుకున్నదన్నారు. పీటీఐ ఎడిటర్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. దక్షిణాదిన మూడు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ కనీసం బోణీ కూడా కొట్టదన్నారు.

ఆ మూడు రాష్ట్రాల్లో సున్నా..

‘190 సీట్లకు ఇప్పటివరకు పోలింగ్‌ పూర్తయ్యింది. నాకున్న సమాచారం ప్రకారం.. మా కూటమికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే 400కు పైగా స్థానాల్లో గెలుస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదం.. 300 సీట్లు అసాధ్యం, కనీసం 200కు పైగా స్థానాల్లో గెలవడం భాజపాకు సవాలుతో కూడుకున్న పని. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ‘సున్నా’ సీట్లు వస్తాయి. తెలంగాణలో వారికి కొన్ని సీట్లు ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి కష్టపడతారు. కర్ణాటకలో కాషాయ పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు’ అని శశిథరూర్‌ అంచనా వేశారు.

‘కాలా పత్తర్‌’లో.. బిహారీ బాబు-సర్దార్‌జీల పోరు

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ సీట్లకు గాను 2019లో భాజపా 25 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో 17 సీట్లలో నాలుగింటిని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం దక్షిణాదిన భాజపా గతంలో కంటే దారుణ ఫలితాలు పొందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత థరూర్‌ స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో గతంలో భాజపా మెరుగైన ఫలితాలు సాధించిందన్న ఆయన.. వాటిని పునరావృతం చేయడం అసాధ్యమన్నారు. ఇంకా 353 స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉందని.. తమ పార్టీతోపాటు విపక్ష కూటమి ‘ఇండియా’ ఎలాంటి పురోగతి సాధిస్తుందో వేచి చూడాలన్నారు. ఏదేమైనా భాజపాకు కష్టకాలమేనని, పరిస్థితులు ఆవిధంగా కనిపిస్తున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img