icon icon icon
icon icon icon

Lok Sabha Polls: మూడు విడతల్లోనూ ప్రజా మద్దతు మా వైపే: అఖిలేశ్‌ ధీమా

దేశంలో ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు తమకు, ఇండియా కూటమికే ఉందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

Published : 08 May 2024 18:12 IST

షాజహాన్‌పుర్‌: సార్వత్రిక సమరంలో భాగంగా ఇప్పటివరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. తొలి దశ నుంచీ భాజపా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతోన్న ఈ ఎన్నికలు రాజ్యాంగ రక్షకులకు, భక్షకులకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. బుధవారం యూపీలోని షాజహాన్‌పుర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు.  

‘మన ఇంటికి బాబు’.. టెక్నాలజీ సాయంతో మన ఇంటికే చంద్రబాబు, లోకేష్‌

‘‘గత పదేళ్లలో గణాంకాలు చూస్తే.. భాజపా చెప్పినవన్నీ అవాస్తవాలే. రైతుల ఆదాయం రెట్టింపు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం తగ్గిస్తామని చెప్పారు.  భాజపా సర్కారు వ్యవసాయానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను లోక్‌సభలో ఆమోదించింది. వాటిని వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున ఆందోళన చేస్తే.. గోడలు కట్టి, వారిని నిరోధించేందుకు రోడ్లపై మేకులు వేశారు. ఆ తర్వాత ఈ చట్టాలను కేంద్రం ఉప సంహరించుకున్నప్పటికీ కనీస మద్దతు ధర (MSP) కోసం చేస్తోన్న పోరాటం అసంపూర్తిగా ఉంది. రైతులు పండించిన పంటలకు ఇప్పటికీ ధర లభించడం లేదు. రైతులు ఎంఎస్‌పీ కోసం చేపట్టిన ఉద్యమం అసంపూర్తిగానే ఉంది. ఇప్పటికే అన్నదాతలు తమ ఉత్పత్తులకు తగిన ధరను అందుకోలేకపోతున్నారు. మన రైతులకు ఎంఎస్‌పీ లభిస్తే తప్ప వారి ఆదాయం పెరగదు. రైతులు సంతోషంగా ఉండరు. ఈ దేశం అభివృద్ధి చెందదని విశ్వగురువుగా కావాలనుకొనే వారికి మేం చెప్పాలనుకొంటున్నాం’’ అని ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని ఆరోపించిన ఆయన.. రైతులకు మాత్రం ఏమీ చేయలేదని మండిపడ్డారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img