icon icon icon
icon icon icon

Yogi Adityanath: యోగి పర్యటనలో బుల్‌డోజర్ల బ్రేక్‌డ్యాన్స్‌..!

యూపీలో జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో బుల్‌డోజర్లతో డ్యాన్స్‌లు వేయించారు. చివరికి ఎమ్మెల్యే జోక్యం చేసుకొని మందలించడంతో వాటిని ఆపారు. 

Updated : 09 May 2024 15:08 IST

ఇంటర్నెట్‌డెస్క్: రాజకీయ నాయకుల ప్రచారాల్లో కార్యకర్తలు డ్యాన్స్‌లు వేయడాన్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, ఇటీవల యూపీలో మాత్రం ఓ ర్యాలీలో బుల్‌డోజర్లు డ్యాన్స్‌లేశాయి. ఈ ఘటన రాష్ట్రంలోని ఫరూఖాబాద్‌ లోక్‌సభ స్థానం అలీగంజ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) ర్యాలీలో చోటు చేసుకొంది.

స్థానిక డావ్‌ ఇంటర్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో యోగి నిన్న ప్రసంగించారు. ఆయన వేదిక వద్దకు రావడానికి ముందే డజన్ల కొద్దీ బుల్‌డోజర్లను అక్కడికి తీసుకువచ్చారు. ఆ తర్వాత మ్యూజిక్‌కు అనుగుణంగా.. ఆపరేటర్లు అటూ ఇటూ తిప్పుతూ బుల్‌డోజర్లతో విన్యాసాలు చేయించారు. కొందరు కార్యకర్తలు వాటిపైకి ఎక్కి నినాదాలు చేశారు. వీటిని 360 డిగ్రీల కోణంలో తిప్పారు. ఇంజిన్‌కు ఒక్కసారిగా యాక్సిలిరేషన్‌ ఇచ్చి.. బ్రేకులు వేయడం వంటివి చేశారు. ఒక దశలో వేదికపై ప్రసంగాల కంటే ప్రజలు ఈ బుల్‌డోజర్ల పైనే ఆసక్తి చూపడం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యే సత్యపాల్‌ సింగ్‌ రాఠోడ్‌ స్పందించారు. ఆపరేటర్లు తక్షణమే వాటిని ఆపాలని కోరారు. అయినా, వారు వినకుండా కొనసాగించారు. దీంతో ఆయన వారిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే చెడ్డపేరు వస్తుందని మందలించారు. 

ఆ తర్వాత సీఎం యోగి వేదిక వద్దకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘క్రిమినల్స్‌, దేశ వ్యతిరేక శక్తులతో డీల్‌ చేయడానికి ఈ యంత్రాలను విభిన్నమైన పద్ధతిలో వాడుతున్నాం. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ మన రక్షణకు తూట్లు పొడుస్తున్నాయి. ప్రతి ఒక్కరి జేబులను దోచుకోవడానికి వారు జట్టుకట్టారు. రామమందిరాన్ని వ్యతిరేకించే కూటమి అది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img