icon icon icon
icon icon icon

Modi: మీ ఓటు ఏం చేయగలదో తెలుసా..: ప్రధాని మోదీ

నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు. ఆయన మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభలో పలు ఆరోపణలు చేశారు. 

Updated : 07 May 2024 13:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రజల ఓటే భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిందని, ప్రపంచంలో దేశ పరపతి పెంచిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనేలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా నిర్ణయంతోనే ఆదివాసి కుమార్తె రాష్ట్రపతి అయ్యారని, మహిళలకు రిజర్వేషన్లు లభించాయని, అవినీతిపరులు జైళ్లకు పోతున్నారని, ఉచిత రేషన్‌ వస్తోందన్నారు. కాంగ్రెస్‌ సృష్టించిన గోతులను పూడ్చుకొంటూ వచ్చిన భాజపా మధ్యప్రదేశ్‌కు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. భారత్‌ చరిత్రలోనే అత్యంత కీలక మలుపు వద్ద ఉందన్నారు. 

‘‘నేను మంచి చేయబట్టే.. నాకు ఈ రోజుల ప్రజల మద్దతు లభిస్తోంది. వికసిత్‌ భారత్‌ కలలను సాకారం చేసుకొనేందుకు మరోసారి మీ ఆశీర్వాదం తీసుకొనేందుకు వచ్చాను. నర్మదా తీరంలోని ప్రజలు ఎవరినీ నిరాశపర్చరని తెలుసు’’ అని ప్రధాని పేర్కొన్నారు. 

తమ వారసత్వాలను కాపాడుకొనేందుకే ‘ఇండియా కూటమి’లోని పక్షాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. తమ సంతానానికి పార్టీలను అప్పజెప్పేందుకే ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని దుయ్యబట్టారు.  వాటికి ప్రజల సంతోషంతో సంబంధం లేదన్నారు. ప్రతిపక్షాలు ఫేక్‌ వీడియోలు తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏమైనా సరే తమ పని జరగడమే వాటికి ముఖ్యమన్నారు.  తనపై ఓట్‌ జిహాద్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కొన్ని వర్గాలకు పిలుపునిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ పార్టీ మూర్ఖత్వం ఆ స్థాయిలో ఉందన్నారు. నిరాశ వారిని చుట్టుముట్టిందని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడిన నేతలు సంతోషంగా ఊపిరి పీల్చుకొంటున్నారని మోదీ వ్యాఖ్యానించారు. రామమందిరానికి వెళ్లినందుకు మహిళా నేతను ఆ పార్టీ వేధించినట్లు తెలిపారు.  మావోయిస్టు, ముస్లిం లీగ్‌ పార్టీలను కాంగ్రెస్‌ హైజాక్‌ చేసిందన్నారు. ఆ పార్టీ యువరాజు సుప్రీం తీర్పును మార్చాలని చూస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img