icon icon icon
icon icon icon

ఆ తెగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సత్ఫలితాలిస్తోన్న ఈసీ చర్యలు

మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటుచేయడం.. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం కోసం ఈసీ అన్ని రకాల చర్యలు చేపడుతోంది.

Published : 07 May 2024 19:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓవైపు అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు.. మరోవైపు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలు.. పెద్దగా రవాణా సదుపాయాలు లేని ఇలాంటిచోట్ల పోలింగ్‌ నిర్వహించడం ఎన్నికల సంఘానికి సవాలే. అయితే.. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరినీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం చేసేందుకు ఈసీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

దేశ జనాభాలో 8.6 శాతం ఆదివాసీలు ఉన్నట్లు సమాచారం. అందులో అంతరించిపోతున్న ఆదివాసీ సమూహాలు 75 ఉన్నాయి. రవాణా సదుపాయాలు పెద్దగా లేని ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలను ఓటర్లుగా నమోదు చేయడమే కాకుండా.. వారు ఉంటున్న ప్రాంతాల్లోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఈ కారణంగానే ఏప్రిల్‌ 19న జరిగిన తొలిదశ ఎన్నికల్లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని గ్రేట్‌ నికోబార్‌ ప్రాంతంలోని షోంపెన్‌ తెగ మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంది.

  • గత కొంతకాలంగా ఈసీ ఈ దిశగా విస్తృతమైన చర్యలు చేపడుతోంది. ఆదివాసీ తెగలు ఓటుహక్కు పొందేలా.. ప్రత్యేకమైన ప్రచారాలు, రిజిస్ట్రేషన్‌ డ్రైవ్‌లు నిర్వహించింది.
  • ఒడిశాలో అత్యధికంగా 13 అంతరించిపోతున్న ఆదివాసీ తెగలు ఉన్నాయి. వీరి జనాభా 2.64 లక్షలు ఉండగా.. 1.84 లక్షల మంది అర్హత గల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 100 శాతం నమోదు ప్రక్రియ పూర్తయిందని.. వారి స్థానిక భాషల్లోనే ఇక్కడ స్పెషల్‌ డ్రైవ్‌లను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 666 థీమ్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటుచేశారు. ఈ రాష్ట్రంలో 4వ దశ నుంచి 7వ దశ వరకూ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.
  • చత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఆదివాసీ తెగలు 5 ఉన్నాయి. 18 జిల్లాల్లో వీరు విస్తరించి ఉన్నారు. ఇక్కడ 1.20 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉండగా.. వంద శాతం నమోదు ప్రక్రియను పూర్తి చేసి వారికి ఓటరు గుర్తింపుకార్డులు అందించారు. తమిళనాడులో 6, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 9, గుజరాత్‌లో 5 తెగలు ఉన్నాయి. వీరంతా ఓటర్లుగా నమోదు చేసుకునేలా ఈసీ అన్నిరకాల చర్యలు తీసుకుంది.
  • ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేయడం రిస్క్‌తో కూడుకున్న పని. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో 102 గ్రామాల్లో తొలిసారిగా పోలింగ్‌ బూత్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఝార్ఖండ్‌లోని పాథెల్‌, గాడియా ప్రాంతాల్లో కూడా పోలింగ్‌ కేంద్రాలను మొదటిసారి ఏర్పాటుచేసింది. పోలింగ్‌ సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు ఇక్కడ హెలికాప్టర్లను కూడా వాడుతున్నారు. గతంలో ఈ ప్రాంతాల వారు ఓటు వేయడానికి కొన్ని మైళ్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
  • గుజరాత్‌లోని మినీ ఆఫ్రికా గ్రామంలో మూడో దశలో ఉత్సాహంగా పోలింగ్‌ జరుగుతోంది. జంబుర్‌ ప్రాంతంలో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 2022లో తొలిసారిగా వీరికి ప్రభుత్వం ఓటుహక్కు కల్పించింది. ప్రత్యేకంగా వీరి కోసం ఓ పోలింగ్‌ బూత్‌ కూడా ఏర్పాటుచేశారు. వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు వలస వచ్చారు. వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img