icon icon icon
icon icon icon

స్వతంత్రులుగా సత్తా చాటారు!

ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులకు పట్టం కట్టడంతో పాటు, స్వతంత్రులుగా బరిలో దిగిన వారికి సైతం ఓటు వేసి గెలిపించి విలక్షణ తీర్పు అందించారు.

Updated : 17 Nov 2023 10:15 IST

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులకు పట్టం కట్టడంతో పాటు, స్వతంత్రులుగా బరిలో దిగిన వారికి సైతం ఓటు వేసి గెలిపించి విలక్షణ తీర్పు అందించారు. పార్టీ టికెట్‌ ఆశించి రాని వారు కొందరైతే.. మరికొందరు నేరుగా బరిలో దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించిన వారున్నారు. 1952 నుంచి 12 నియోజకవర్గాల పరిధిలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా, ఇప్పటి వరకు 18 మంది స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. అన్ని ఎన్నికలు పరిశీలిస్తే.. 1967లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 6 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం విశేషం. అప్పట్లో అభ్యర్థికి ఓటర్లు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో ఈ విజయాలు తెలియజేస్తున్నాయి.

కొల్లాపూర్‌

కృష్ణాతీరంలో విస్తరించిన కొల్లాపూర్‌ నియోజకవర్గంలో 1967 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వెలటూరుకు చెందిన నర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి కె.రంగదాసును 1,572 ఓట్ల తేడాతో ఓడించారు. అలాగే 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కె.రంగదాసు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కొత్త వెంకటేశ్వర్రావును ఓడించారు. మంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు సైతం 2004 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ విజయం సాధించారు.

గద్వాల

నడిగడ్డగా పిలిచేే గద్వాల నియోజకవర్గంలో 1957 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సత్యారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి పుల్లారెడ్డిపై 9,963 ఓట్లతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో జీ.రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, 7,427 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే.సత్యారెడ్డిపై విజయం సాధించారు. 1994లో డీకే.భరతసింహారెడ్డి 35,561 ఓట్ల ఆధిక్యంతో అన్న సమరసింహారెడ్డిపై గెలిచారు.

మక్తల్‌

మక్తల్‌ నియోజకవర్గానికి 1957లో జరిగిన ఎన్నికల్లో బన్నప్ప 21,152 ఓట్లు సాధించి మొదటి విజేతగా నిలిచారు.

కల్వకుర్తి

1967 ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జీ.రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.తల్పల్లికర్‌పై 4,743 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు.

జడ్చర్ల

జడ్చర్ల పట్టణానికి చెందిన కొత్త కేశవులు 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి, కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిపై 4,830 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మూసాపేట మండలం పోల్కంపల్లికి చెందిన లక్ష్మినర్సింహారెడ్డి 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌దేవ్‌రెడ్డిపై 4,670 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నాగర్‌కర్నూల్‌

1952లో నాగర్‌కర్నూల్‌ జనరల్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ్రహ్మారెడ్డి 26,243 ఓట్లు సాధించి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 8,841 ఓట్లు వచ్చాయి. ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగ నారాయణగౌడ్‌ 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిపై 11,574 ఓట్ల మెజారిటీతో నెగ్గారు.

అలంపూర్‌

2004లో అలంపూర్‌ నియోజకవర్గ ఎన్నికల్లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పోటీ చేయగా, తెదేపా అభ్యర్థి వావిలాల సునీతపై 4,247 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

అమరచింత‘

అమరచింత నియోజకవర్గంగా ఉన్న 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌.భోపాల్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, 2,465 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి జె.దేవమ్మపై విజయం సాధించారు.

మహబూబ్‌నగర్‌

1962 ఎన్నికల్లో కందూరుకు చెందిన ఎం.రామిరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో స్వతంత్రంగా బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఇబ్రహీం అలీపై 15,282 ఓట్లతో గెలుపొందారు. 1972లోనూ ఈయన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచారు. 2004లో పులి వీరన్న, టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై 19,282 ఓట్లతో గెలుపొందారు. 2009లో రాజేశ్వర్‌రెడ్డి భాజపాకు రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. తెరాస అభ్యర్థి సయ్యద్‌ ఇబ్రహీంపై 5,137 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img