icon icon icon
icon icon icon

KCR: ‘నేను పిడికిలి బిగించగానే మళ్లీ రైతుబంధు పడుతోంది’: కేసీఆర్‌

మోదీ పాలనలో తెలంగాణకు ఏదైనా మేలు జరిగిందా? అని భారాస అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. 

Published : 06 May 2024 22:05 IST

నిజామాబాద్‌: మోదీ పాలనలో తెలంగాణకు ఏదైనా మేలు జరిగిందా? అని భారాస అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ 150 నినాదాలు చెప్పారని, అందులో ఒక్కటైనా నిజమైందా? అని అన్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బాజిరెడ్డి. గోవర్ధన్‌రెడ్డికి మద్దతుగా కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ నుంచి నెహ్రూచౌక్‌ చౌరస్తా వరకు రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మోదీ అచ్చే దిన్‌ అంటే.. రైతులకు చచ్చేదిన్‌ వచ్చిందని వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా.. సాగు ఖర్చులు డబుల్‌ అయ్యాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ కూడా ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వరి పంటకు బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌... ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ‘‘విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఇవ్వడం లేదు. నేను బస్సెక్కి పిడికిలి బిగించగానే మళ్లీ రైతుబంధు పడుతోంది. తెలంగాణ గళం, బలం భారాస మాత్రమే. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే తాజా ఎన్నికల్లో భారాస గెలవాలి. రూ.2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు పోరాడుతాం. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లనుసైతం కాంగ్రెస్‌ పక్కన పెట్టేసింది. కేసీఆర్‌ కిట్టు నిలిపేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. తెలంగాణలో మళ్లీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇలా మారిందంటే... దానికి కాంగ్రెస్‌ పార్టీ అసమర్థత కారణం కాదా? ఐదేళ్లు ఈ ప్రభుత్వం కొనసాగుతుందా?’’ అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img