icon icon icon
icon icon icon

LS polls: ముగిసిన మూడోదశ.. 60 శాతం పోలింగ్‌ నమోదు

మూడో దశ ఎన్నికల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.

Published : 07 May 2024 19:59 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో దశ పోలింగ్‌ ముగిసింది. 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్‌లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా అన్నిచోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 60.19 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 93 పార్లమెంటు నియోజకవర్గాల్లో 1,300 మందికిపైగా అభ్యర్థుల అదృష్టం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

అస్సాంలో అత్యధికంగా 74.86శాతం పోలింగ్‌ నమోదు కాగా.. పశ్చిమబెంగాల్‌లో 73.93 శాతం ఓటింగ్‌ నమోదైంది. బెంగాల్‌లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో మాత్రం అత్యల్పంగా 53.63శాతం, బిహార్‌లో 56.01శాతం పోలింగ్‌ రికార్డయ్యింది. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు 60.19శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్‌ సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తుండటంతో కొన్నిచోట్ల ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

మూడోవిడతలో మొత్తంగా 17.24 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 8.39 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరికోసం 1.85 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. గుజరాత్‌ 25, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, ఉత్తర్‌ప్రదేశ్‌ 10, మధ్యప్రదేశ్‌ 9, ఛత్తీస్‌గఢ్‌ 7, బిహార్‌ 5, పశ్చిమబెంగాల్‌ 4, అస్సాం 4, గోవా 2, దాద్రానగర్ హవేలీ, దమణ్‌ దీవ్‌ 2 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img