icon icon icon
icon icon icon

Rahul Gandhi: మోదీ ప్రభుత్వంలో ఆ హక్కులన్నీ పారిశ్రామికవేత్తలకే : రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అధికార భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

Published : 07 May 2024 19:30 IST

రాంచీ: మోదీ అధికారంలోకి వస్తే జల్‌, జంగిల్‌, జమీన్‌( నీరు, అడవులు, భూములను) కొందరు పారిశ్రామికవేత్తలకే అప్పగిస్తారని రాహుల్‌ ఆరోపించారు. రాహుల్‌ మంగళవారం జార్ఖండ్‌లోని చైబా ప్రాంతంలో నిర్వహించిన పార్టీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన భాజపాపై విమర్శలు చేశారు. 

ప్రధాని మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజనుల నీరు, అడవులు, భూములను కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రమే అప్పగిస్తారని విమర్శించారు. మోదీ పదేళ్ల పాలనలో 22 మంది పారిశ్రామికవేత్తలను కోటీశ్వరులు చేశారని రాహుల్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజలను లక్షాధికారులను చేస్తుందని, పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుందని రాహుల్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్‌లు అందిస్తామన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు గిరిజనులు, వెనకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియా కూటమి నాయకులు  రాజ్యాంగ పరిరక్షణకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని రాహుల్‌ పేర్కొన్నారు. 

మూడో దశ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. దీనిపై రాహుల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ఈరోజు మూడో దశ ఓటింగ్. మీ హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా పెద్దసంఖ్యలో వచ్చి ఓటు వేయండి. గుర్తుంచుకోండి. ఇవి సాధారణ ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు’’ అంటూ రాసుకొచ్చారు.

మూడో దశ ఎన్నికల్లో దాదాపు 1300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో 17.24 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు. కాగా వీరిలో మహిళా ఓటర్లు 8.39 కోట్ల మంది. ఈ దశ ఎన్నికల్లో 18.5 లక్షల మంది అధికారులతో 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img