icon icon icon
icon icon icon

Loksabha polls: రాయ్‌బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా

రాయ్‌బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారని అమిత్‌ షా జోస్యం చెప్పారు.

Published : 04 May 2024 19:31 IST

గాంధీనగర్‌: వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీలో భారీ తేడాతో ఓడిపోతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లాలోని బోడెలి పట్టణంలో పార్టీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన షా దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతుల కోసం ఉద్దేశించిన కోటాను ప్రతిపక్ష ఇండియా కూటమి దోచుకుంటోందని ఆరోపించారు. 

‘‘రాహుల్‌ గాంధీ అమేఠీలో ఓడిపోయినప్పుడు వయనాడ్‌ వెళ్లారు. ఈసారి వయనాడ్‌ నుంచి కూడా ఓడిపోతాననే భయంతో ఆయన రాయ్‌బరేలీలోనూ పోటీ చేస్తున్నారు. రాహుల్‌ మీకు నా సలహా ఏంటంటే సమస్య మీరు పోటీ చేసే స్థానాల్లో లేదు. మీలో ఉంది. కాబట్టి రాయ్‌బరేలీలో కూడా భారీ తేడాతో ఓడిపోతారు.’’అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

మరోసారి మోదీని గెలిపిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు చేస్తుందని షా మండిపడ్డారు. భాజపా అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 4 శాతం కోటాను దోచుకొని ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన కోటాను లాక్కొని ముస్లింలకు ఇస్తారని కేంద్రమంత్రి మండిపడ్డారు. రిజర్వేషన్లను లాక్కున్నవారే మోదీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తోందని షా దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆదివాసీ వ్యతిరేకి అని, అందుకే దాదాపు 70 ఏళ్లుగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరినీ దేశ అధ్యక్షుడిగా నియమించలేదని షా పేర్కొన్నారు. ప్రధాని మోదీ తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారని తెలిపారు. 

‘‘ఒకప్పుడు పాకిస్థాన్‌ నుంచి చొరబాటుదారులు దేశంలో తరచూ బాంబుపేలుళ్లకు పాల్పడేవారు. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ చర్యలు తీసుకోలేదు. ప్రధాని మోదీ తన పదేళ్ల పాలనలో దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించారు’’ అని కేంద్ర మంత్రి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img