icon icon icon
icon icon icon

Modi: అప్పుడు కాంగ్రెస్ ఏడుపులు.. ఇప్పుడు పాక్‌ ఆర్తనాదాలు : మోదీ

ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ (Modi).. అక్కడి అధికార కూటమి జేఎంఎం-కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

Published : 04 May 2024 14:46 IST

ఇంటర్నెట్‌డెస్క్: కాంగ్రెస్‌ (Congress) దేశాన్ని పాలించిన రోజుల్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రదాడుల తర్వాత ఏమీ చేయలేక, అంతర్జాతీయ వేదికలపై సహాయం కోసం అర్థించేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝార్ఖండ్‌లో పర్యటిస్తోన్న ఆయన కాంగ్రెస్‌, జేఎంఎం (Jharkhand Mukti Morcha)లపై విమర్శలు చేశారు.

‘‘గతంలో ఉగ్రదాడుల తర్వాత.. కాంగ్రెస్ నేతృత్వంలోని పిరికి ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై పెడబొబ్బలు పెట్టేది. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ప్రస్తుతం సహాయం కోసం ఏడుస్తూ కేకలు పెడుతోంది. సర్జికల్ స్ట్రైక్స్‌తో అల్లాడిపోయిన దాయాది దేశం.. యువరాజు ప్రధాని కావాలని ప్రార్థిస్తోంది’’ అని ప్రధాని దుయ్యబట్టారు. అయితే బలమైన భారత్‌.. అంతే బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటోందన్నారు. అలాగే ఝార్ఖండ్‌ అధికార కూటమి జేఎంఎం-కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ పార్టీల నేతలు తమ వారసుల కోసం భారీగా సంపదను కూడబెడుతున్నారని ఆరోపణలు చేశారు. ‘‘నాకు సొంతంగా ఇల్లు, సైకిల్‌ కూడా లేదు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్న కాలంలో నాపై ఒక్క అవినీతి మచ్చా లేదు’’ అని అన్నారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల తన సోషల్‌మీడియా ఖాతాలో రాహుల్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత ప్రసంగించిన వీడియోను షేర్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. దీనిపై ఇటీవల మోదీ మాట్లాడుతూ.. ‘‘దేశంలో కాంగ్రెస్‌ నానాటికీ బలహీన పడుతోంది. ఇక్కడ ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్‌ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌ యువరాజును (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) భారత ప్రధానిని చేయాలని దాయాది దేశం తహతహలాడుతోంది. ఆ పార్టీ పాక్‌కు అభిమాని అని మనకు తెలుసు. ఇప్పుడు వారి మధ్య భాగస్వామ్యం బయటపడింది’’ అని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img