icon icon icon
icon icon icon

PM Modi: పశువుల మేత మేసిన నేత.. రిజర్వేషన్లపై మాటలా?: లాలూపై మోదీ ఫైర్‌

PM Modi: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. లాలూ దాణా కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ గట్టిగా చురకలంటించారు. 

Published : 07 May 2024 18:54 IST

భోపాల్‌: ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు కల్పించాలంటూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ (Lalu Prasad Yadav) యాదవ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) స్పందిస్తూ లాలూపై తీవ్రంగా మండిపడ్డారు. పశువుల మేత మేసేసిన నేత.. రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ లాలూ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఇప్పుడు మౌనంగా ఉంది. కానీ, వారి మిత్రపక్ష పార్టీకి చెందిన ఓ నేత విపక్ష కూటమి ఉద్దేశాలను బయటపెట్టారు. పశువుల గ్రాసాన్ని మేసేసి జైలుకెళ్లిన నేత (లాలూ దాణా కుంభకోణాన్ని ఉద్దేశిస్తూ) ఆయన. కోర్టు ఆయనను శిక్షించగా.. అనారోగ్య కారణాలు చూపి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పుడు సిగ్గు లేకుండా ముస్లింలకే పూర్తి రిజర్వేషన్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. దానర్థం ఏంటీ? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లను దోచుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు’’ అని మోదీ మండిపడ్డారు.

‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ

ఈ ఉదయం లాలూ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల గురించి స్పందించారు. ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత భాజపా రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది. ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందాలి. అది కూడా పూర్తిగా’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై భాజపా, జేడీయూ నేతల నుంచి పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో తన వ్యాఖ్యలపై లాలూ వివరణ ఇచ్చారు. ‘‘మత ప్రాతిపదికన కాకుండా, సామాజిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించాలి’’ అంటూ వీడియో సందేశం విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img