నమ్మండి.. నేను బతికే ఉన్నా!

వృత్తిపరంగా పదవీవిరమణ పొందినవారు, ఇతర వృద్ధులు పింఛన్లు పొందుతుంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు వారు బతికే ఉన్నట్లు అధికారులకు ‘లైవ్‌ సర్టిఫికేట్‌’ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పొరపాటున బతికున్నవారిని కూడా మరణించిన వారి జాబితాలో లెక్కకడుతుంటారు. ఇలాంటివి

Updated : 15 Jan 2021 13:57 IST

నిరూపించేందుకు మూడేళ్లుగా కష్టపడుతున్న మహిళ

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృత్తిపరంగా పదవీవిరమణ పొందినవారు, ఇతర వృద్ధులు పింఛన్లు పొందుతుంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు వారు బతికే ఉన్నట్లు అధికారులకు ‘లైవ్‌ సర్టిఫికేట్‌’ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పొరపాటున బతికున్నవారిని కూడా మరణించిన వారి జాబితాలో లెక్కకడుతుంటారు. ఇలాంటివి జరిగినప్పుడు ఫిర్యాదు చేయగానే సరిచేస్తారు. కానీ, ఫ్రాన్స్‌కు చెందిన జెన్‌ పౌచైన్‌ అనే వృద్ధ మహిళ తాను బతికే ఉన్నానని నిరూపించడం కోసం మూడేళ్లుగా కష్టపడుతోంది. అయితే, ఇది అధికారుల పొరపాటు కాదు. ఆమె వద్ద పనిచేసిన ఒక మహిళా ఉద్యోగి చేసిన నిర్వాకం. ఆ ఉద్యోగిని వేసిన ఒక కేసుతో జెన్‌ జీవితం పూర్తిగా తలకిందులైంది. బతికున్నా ఎలాంటి గుర్తింపు లేక అవస్థలు పడుతోంది.

58 ఏళ్ల వయసున్న జెన్‌ పౌచైన్‌కు క్లీనింగ్‌ కంపెనీ ఉంది. ఆ సంస్థ 2000 సంవత్సరంలో ఓ కాంట్రాక్టును కోల్పోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో సంస్థలో పనిచేసే కొందరు ఉద్యోగులను జెన్‌ తొలగించింది. అలా ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ జెన్‌ సంస్థపై కేసు వేసింది. ఉద్యోగం కోల్పోయిన మహిళకు 14,000యూరోలు పరిహారం ఇవ్వాల్సిందిగా 2004లో జెన్‌ సంస్థను కోర్టు ఆదేశించింది. కానీ, కోర్టు ఆదేశాలను జెన్‌ అమలు చేయలేదు. ఐదేళ్ల తర్వాత మరోసారి జెన్‌పై ఆ మహిళ కేసు వేసినా.. ఇతర కారణాలతో కోర్టు కొట్టివేసింది. దీంతో జెన్‌ ఊపిరి పీల్చుకున్నా.. కొన్నాళ్లకు పెద్ద సమస్యే వచ్చి పడింది. 

మూడోసారి చిక్కుముడి..

రెండు సార్లు జెన్‌పై కేసు వేసి విఫలమైన మహిళ ఈ సారి మరింత పకడ్బందీగా జెన్‌ను ఇబ్బందుల పాలుచేసింది. జెన్‌ తన ఉత్తరాలకు జవాబు ఇవ్వలేదు కాబట్టి, తను మరిణించినట్లే పరిగణించాలని, జెన్‌కు బదులుగా ఆమె భర్త, కుమారుడు తనకు పరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును కోరింది. ఆ మహిళ వాదనలు నమ్మిన కోర్టు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండానే 2017లో జెన్‌ మరణించినట్లు ప్రకటించింది. దీంతో జెన్‌ ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఆరోగ్య బీమా అన్నీ రద్దయ్యాయి.

కోర్టు తీర్పును తప్పుబడుతూ జెన్‌ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది. అనేక మంది న్యాయమూర్తుల ముందు నిలబడి తను బతికే ఉన్నట్లు ఎంత చెప్పినా వారు నమ్మకపోవడం మరింత విడ్డూరం. ఇప్పటికీ జెన్‌ కోర్టుల చుట్టూ తిరుగుతూ తన గుర్తింపును తిరిగి దక్కించుకోవడం కోసం పోరాడుతోంది. ఈ కేసులో విజయవకాశాలు ఎలా ఉన్నా.. చివరి వరకు ప్రయత్నిస్తామని జెన్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని