వనస్థలిపురం ఏసీపీపై సస్పెన్షన్‌ వేటు!

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ ఎస్‌.జయరామ్‌ను సస్పెండ్‌ చేస్తూ సోమవారం డీజీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ..

Updated : 18 Aug 2020 07:30 IST

హైదరాబాద్‌: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం ఏసీపీ ఎస్‌.జయరామ్‌ను సస్పెండ్‌ చేస్తూ సోమవారం డీజీ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న జయరాం రెండేళ్ల క్రితం వనస్థలిపురం ఏసీపీగా బాధ్యతలు చేపట్టారు. కొన్ని నెలలుగా పలు వివాదాల్లో తలదూర్చుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఓ ప్రముఖుడి కోసం ప్రైవేటు పంచాయితీ నిర్వహించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతర్గతంగా విచారణ చేపట్టి వేటు వేశారు.

ఇదీ అసలు కారణం.. బాహ్యవలయ రహదారికి సమీపంలోని మండలంలో ఒక రియల్టర్‌ వెంచర్‌ వేశారు. ఇది అక్రమమంటూ బాధితులు కొందరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం ఏసీపీ వరకూ రావడంతో విచారణ చేపట్టారు. అయితే ఈ భూ వివాదానికి సంబంధించి సదరు రియల్టర్‌కే ఏసీపీ వత్తాసు పలికారని విశ్వసనీయంగా తెలిసింది. వివాదాస్పద భూమిలో కొద్దిరోజుల నుంచి అక్కడే ఉండి కంచె వేయించటం, సరిహద్దు రాళ్లు పాతించటం వంటివి చేయించారని బాధితులు ఆరోపించారు. ఈ స్థలాన్ని సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని వారు తెలిపారు. అతడితో స్నేహం కారణంగానే ఏసీపీ పరిధికి మించి వ్యవహరించారని సమాచారం. మరోవైపు పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒకరిద్దరు మహిళా సిబ్బందిని ఏసీపీ వేధించినట్లు తెలిసింది. బాధితుల్లో ఒకరు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏసీపీకి వ్యతిరేకంగా ఆధారాలు లభించటంతో సస్పెండ్‌ చేశామని ఒక ఉన్నతాధికారి ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని