Published : 29 Dec 2020 09:31 IST

రెండువేల ఏళ్లనాటి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌!

పాంపేయి (రోమ్‌): ఏ సమాజంలో అయినా చిరుతిళ్లు అక్కడి ఆహార విధానంలో విడదీయలేని భాగమే. వీధిలో లేదా ఏదైనా బహిరంగ ప్రదేశంలో తినడానికి లేదా తాగడానికి సిద్ధంగా  లభించే చిరుతిళ్లనే మనం ఫాస్ట్‌ఫుడ్‌ లేదా స్ట్రీట్‌ ఫుడ్‌ అంటాం. రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాల్లో ఆకర్షణీయంగా కనిపిస్తూ, మన నోరు ఊరేలా చేసే ఈ ఆహారం ఎప్పుడో రెండువేల ఏళ్ల క్రితం కూడా లభించేదంటే... నమ్మటం కాస్త కష్టమే మరి. అయితే ఇటీవల రోమ్‌లోని పాంపేయి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిథిలాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి! ఇవి క్రీస్తు శకం 79 సంవత్సరానికి చెందినవని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు.

చరిత్ర ఏం చెపుతోందంటే..

ఒకప్పటి అఖండ భారత ఖండంలో భాగమై, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న మొహంజోదారో, హరప్పా శిథిలాల మాదిరిగా.. ఇటలీలో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో పాంపేయి నగరం కూడా ఒకటి. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ప్రదేశాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ పురాతన రోమన్‌ నగరాన్ని సంవత్సరానికి సుమారు 25 లక్షల మంది సందర్శిస్తారట.

గ్రీకు-రోమన్‌ జీవన విధానానికి అద్దం పట్టే ఈ నగరం..  ఇక్కడకు సమీపంలో ఉన్న వెసూవియస్‌ అగ్నిపర్వతం పేలుడు కారణంగా శిథిలమైపోయింది. ఆ సమయంలో అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాంపేయి 13 నుంచి 20 అడుగుల లోతున కప్పబడిపోయింది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో నాణాలు, కొయ్య వస్తువులు, ఆభరణాలు, అలంకారాలతో కూడిన మానవ మృతదేహాలు లభించాయి. అంతేకాకుండా  ఈ శిథిల నగరం ఒకప్పుడుఎంతో సంపన్నంగా ఉండేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.  165 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాంపేయి శిథిలాలు తొలిసారిగా 16వ శతాబ్దంలో బయటపడ్డాయి. ఇప్పటికి సుమారు మూడింట రెండువంతుల నగరాన్ని తవ్వి వెలికి తీశారు. 

 

ఇంతకీ ఇక్కడ ఏం లభించేదంటే..

ఇక్కడ ఉన్న కాల్చిన మట్టిపాత్రల్లో రెండువేల ఏళ్ల నాటి ఆహారం ఆనవాళ్లు లభించాయి.  ఇక్కడి ‘థెర్మోపోలియం’ లేదా వేడివేడి ఆహార పదార్థాలు లభించే దుకాణంలో ముఖ్యంగా చికెన్‌, బాతు మాంసంతో చేసిన పదార్థాలను అమ్మేవారట. వీటితో పాటు పంది మాంసం, చేప, నత్తలు తదితర ఆహారాల ఆనవాళ్లు కూడా లభించాయిని.. ఇవి నాటి ప్రజల ఆహార విధానాన్ని తెలుపుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఆహార పదార్థాలున్న పాత్రలను, వరుసగా ఉన్న మట్టి కౌంటర్లలో ఉండే గుండ్రని గుంతల్లో ఉంచేవారని తెలుస్తోంది. అంతేకాకుండా సూపులు, పానీయాలు వండేందుకు వాడే పింగాణీ పాత్రలు, వైన్‌ ఉంచే పాత్రలు, పటేరా అనే డిజైన్లతో కూడిన కాంస్య పాత్రలు కూడా ఈ ప్రదేశంలో లభించాయి. అక్కడ ఏమేం లభిస్తాయో తెలిపే చిత్రాలు కూడా ఆ దుకాణం గోడలపై చిత్రించి ఉండటం.. అవి ఇప్పటికీ చక్కగా కనిపిస్తూ ఉండటం విశేషం. అంతేకాకుండా అక్కడ ఉన్న కౌంటర్‌ ముందు చిత్రించి ఉన్న అంకెలు.. అక్కడ ఆహారపదార్థాలు, పానీయాలు అమ్మేవారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. 1750 నుంచి ఇక్కడ తవ్వకాలు సాగుతున్నప్పటికీ..  పూర్తి స్థాయి ఆహారశాల లభించటం మాత్రం ఇదే తొలిసారని వారు వెల్లడిస్తున్నారు.

ఇవీ చదవండి.. 

టాప్‌ 10 క్రీడలు ఇవేనట!

ఎయిర్‌పోర్టు లేని దేశాలివే..


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని