Covid: తెలంగాణలో కొత్తగా 6 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6 కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. 

Updated : 20 Dec 2023 23:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం కొత్తగా 6 కొవిడ్‌(Covid) కేసులు నమోదు అయ్యాయి. ఒకరు కొవిడ్‌ నుంచి రికవరీ అయ్యారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ వివరాలు విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివరకు కొవిడ్‌ బారిన పడి మొత్తం 14 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 538 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. శాంపిల్స్‌ సేకరించిన వాటిలో 42 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ రోజు నమోదైన కొవిడ్‌ కేసుల్లో అన్ని హైదరాబాద్‌లోనే వెలుగుచూశాయి. 

కొవిడ్‌ నియంత్రణపై మంత్రి సమీక్ష

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ.. వైద్యారోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కొవిడ్‌ సన్నద్ధతపై బుధవారం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి రాజనర్సింహ.. అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.

హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా, డీహెచ్‌ రవీంద్రనాయక్‌, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్‌ నాగేంద్ర సహా పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్‌ డ్రిల్‌ పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రులకు అవసరమైన డీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ ద్వారా తీసుకోవాలని చెప్పారు. లక్షణాలు ఉంటే కొవిడ్‌ పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. పాజిటివ్‌ వచ్చిన కొవిడ్‌ నమూనాలను విధిగా ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీకి పంపాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిని వైద్యారోగ్య సిబ్బంది మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు కేవలం 0.31 శాతంగా ఉన్నట్టు  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని