కరోనా లేని చోట..గాల్లో తేలుతూ వేడుకలు!

గాల్లో తేలుతూ, కరోనావైరస్ లేని ప్రదేశంలో కొందరు థ్యాంక్స్‌ గివింగ్‌ను చాలా సంతోషంగా జరుపుకున్నారు.

Published : 28 Nov 2020 00:32 IST

అంతరిక్ష కేంద్రంలో ‘థ్యాంక్స్‌ గివింగ్’

వాషింగ్టన్‌: కరోనా వైరస్ లేని ప్రదేశంలో గాల్లో తేలుతూ కొందరు థ్యాంక్స్‌ గివింగ్‌ను చాలా సంతోషంగా జరుపుకొన్నారు. ఇష్టమైన విందును ఆరగించారు. ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకొన్నారు. ఇదేంటి? కరోనా వైరస్ లేని ప్రదేశం ఏదైనా ఉందా అనుకుంటున్నారా? అవును.. మీరు చదివింది నిజమే. అయితే, ఇది భూమిపై కాదులెండి. ఈ వేడుకలు చేసుకున్నది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో..!

ప్రజలందరు కరోనా నిబంధనలు పాటిస్తూ సాధ్యమైనంతవరకు ఒక దగ్గర చేరకుండా పండుగలు జరుపుకొంటూ.. ప్రయాణాలు తగ్గించుకుంటూ గడుపుతోన్న సమయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాత్రం ప్రత్యేక అంతరిక్ష యాత్రకు ప్రణాళిక వేసింది. ఈ క్రమంలోనే కొందరు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడే నాసా, జపాన్‌, రష్యాకు చెందిన ఏడుగురు సభ్యులు థ్యాంక్స్ గివింగ్‌ను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సెలవు రోజున అమెరికన్లు కుటుంబంతో కలిసి భోజనం చేయడం, ఫుట్‌బాల్ ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కాగా, ఈ వ్యోమగాములు తమ విందు, విశేషాల గురించి వెల్లడించిన వీడియోను నాసా ట్విటర్‌లో పోస్టు చేసింది. తమ భోజనంలో టర్కీ కోడి, కర్రీ రైస్, ఆలు ఉన్నాయంటూ వారు చెప్పుకొచ్చారు. ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ను యూఎస్, కెనడా, బ్రెజిల్ వంటి తదితర దేశాల్లో చేసుకుంటారు. ఒక్కో దేశం ఏడాదిలో ఒక రోజును ఈ వేడుకలకు కేటాయించింది. అమెరికాలో మామూలుగా నవంబర్‌ నెలలోని చివరి గురువారం రోజున ఈ వేడుకలు జరుగుతాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని