వ్యాక్సిన్‌ పంపిణీకి సంసిద్ధంగా ఉండండి..!

కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే.. దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ భారీ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

Updated : 31 Oct 2020 12:41 IST

అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే.. దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగే సమయంలో ఇతర ఆరోగ్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా టీకా పంపిణీని, వాటి అంగీకారాన్ని ప్రభావితం చేయగలిగే వదంతులపై సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలని మరోసారి స్పష్టంగా పేర్కొంది.

దాదాపు సంవత్సరం పాటు కొనసాగే ఈ టీకా ప్రక్రియ, తొలుత ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతోనే ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అనంతరం ఇది దేశంలోని అన్ని గ్రూపులకు విస్తరిస్తామని పేర్కొంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వ్యాక్సిన్‌ పంపిణీకి కావాల్సిన శీతల కేంద్రాల సన్నద్ధత, కార్యాచరణ ప్రణాళిక, విభిన్న భౌగౌళిక ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ కమిటీలు నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపింది. తాజాగా వీటి మార్గదర్శకాలపై అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా స్టేట్‌ స్టీరింగ్‌ కమిటీ(ఎస్ఎస్‌సీ), ఆరోగ్యశాఖ అడిషనల్‌ సెక్రటరీ నేతృత్వంలో రాష్ట్ర టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌), జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌(డీటీఎఫ్‌) కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్‌పై సామాజిక మాధ్యమాలతోపాటు ఇతర మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను సాధ్యమైనంత తొందరగా గుర్తించాలని లేఖలో మరోసారి స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని