
చిత్తూరు జిల్లాలో ‘నివర్’ బీభత్సం
ఏరులైపారుతున్న నదులు, వాగులు, చెరువులు
ఇంటర్నెట్ డెస్క్: చిత్తూరు జిల్లాలో నివర్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల ధాటికి అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకుపోతున్నాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతమైన నడుంపల్లి గ్రామం నీట మునిగింది. రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేదంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరిలో భీమ, స్వర్ణముఖి నదుల ఉద్ధృతికి అనేక రహదారులు కొట్టుకుపోయి 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రావారిపాలెం మండలంలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లగా వలసపల్లి, బోడేవాండ్లపల్లి, బాకరాపేటకు వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. రామచంద్రాపురంలోని రాయల చెరువుకు ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
శేషాచల అడవుల నుంచి కళ్యాణి డ్యాంకు వరద పోటెత్తడంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తేస్తామన్న అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో చిత్తూరు జిల్లాలోని అరణియారు, కాలకి, మల్లెమడుగుతోపాటు అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. దీంతో గేట్లు ఎత్తేసి నీటిని కిందకి వదులుతున్నారు. అరణియారు జలాశయం నుంచి 6500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ధాటికి పుంగనూరు నియోజకవర్గంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. పూర్తి వివరాలకు కింది వీడియోను చూడండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.