వాతావరణ మార్పుల వల్లే పెరుగుతున్న పిడుగుపాట్లు! 

ఇటీవల ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల భారీ వర్షాల నడుమ పిడుగుపాట్లు బీభత్సం సృష్టించాయి.

Updated : 15 Jul 2021 10:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవడంతో పాటు పిడుగుపాట్లు బీభత్సం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వేర్వేరు పిడుగుపాట్ల సంఘటనల్లో మొత్తం 74 మంది మృతి చెందారు. తెలంగాణాలోనూ గతవారం వేర్వేరు పిడుగుపాటు సంఘటనల్లో  ఆరుగురు మృతి చెందారు. పిడుగులు పడ్డప్పుడు మనుషులే కాకుండా, మూగజీవాలు కూడా చాలాసార్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇంతకీ పిడుగు పాట్లు పెరగడానికి కారణాలేమిటో చూద్దాం..

వాతావరణ మార్పులు.. భూతాపమే కారణం! 
వాతావరణంలో మార్పుల వల్లనే ఎక్కువగా  పిడుగులు పడుతున్నాయని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. బ్రెజిల్‌లో పిడుగులు అధికంగా పడటానికి భూతాపం, నగరీకరణే కారణమని ‘అట్మాస్ఫియరిక్‌ ఎలక్ట్రిసిటీ గ్రూప్‌’ ప్రచురించిన ఓ నివేదిక తెలియజేసింది. భూమి మీద 1 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగితే, పిడుగులు పడే అవకాశం 12 శాతం పెరుగుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 2015లో చేసిన అధ్యయనం వెల్లడించింది. ఇటీవల మార్చి 2021లో ‘జియో ఫిజికల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌’లో ప్రచురితమైన ఓ నివేదిక వాతావరణ మార్పులకు, ఆర్కిటిక్‌ ప్రాంతంలో పిడుగుపాట్లు ఎక్కువయ్యేందుకు దగ్గరి సంబంధం ఉందని తెలియజేసింది. అక్కడ  2010లో ఏటా 18 వేల పిడుగులు పడుతుంటే, 2020నాటికి అవి 1.5 లక్షలకు పెరిగినట్లు ఆ నివేదిక తెలిపింది.   

కార్చిచ్చులూ కారణం!
భారతదేశంలో 2010 నుంచి 2020 వరకు చేసిన అధ్యయనంలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. పిడుగులు అధికంగా వేసవిలోనే పడుతుంటాయని తేలింది. అడవి కార్చిచ్చుల  ఏర్పడుతున్న సమయంలో క్లౌడ్‌ కండెన్సేషన్‌ న్యూక్లియై(సీఎన్‌ఎన్‌) అనేది మేఘాల్లో పెరుగుతుందని మూడేళ్లపాటు అధ్యయనం చేసిన భారత శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి అధ్యయనమే ఆస్ట్రేలియాలోనూ జరిగింది. కార్చిచ్చుల తర్వాత ఎక్కువ పిడుగులు పడుతున్నాయని మే 2021లో అక్కడి పరిశోధకులు వెల్లడించారు.

పిడుగు ఎలా ఏర్పడుతుంది?
'పిడుగు'లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, ఒక్క పిడుగుపాటుకు 30 మిల్లీ సెకన్లు పడుతుంది. అంటే రెప్పపాటులో నాలుగైదు పిడుగులు పడవచ్చు. మేఘాల్లోని వ్యతిరేక ఆవేశాలు ఉన్న రేణువుల మధ్య ఆకర్షణ వల్ల అవి తమ శక్తిని పరస్పరం విడుదల చేస్తాయి. ఇలా విడుదలైన శక్తి భూమిని తాకుతుంది. అదే పిడుగు!

భూమి మీదే ఎక్కువ
ప్రధానంగా వేసవిలో సముద్ర తీరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే ప్రమాదం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది.  సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. ఆరుబయట పిడుగులు పడటం ఎక్కువ. నగరీకరణ పెరిగిన నేపథ్యంలో జనాభా ఒకేచోట ఎక్కువగా కేంద్రీకృతమవుతుండటంతో పిడుగుపాట్లకు గురయినప్పుడు ఎక్కువ మంది చనిపోతుంటారు.  ఉరుములు, మెరుపుల వర్షం ప్రారంభమైనప్పుడు చెట్ల కింద, సెల్‌ఫోన్‌ టవర్లు, ఎత్తయిన భవనాల వద్ద ఉండకూడదు. అలాగే పిడుగులు పడుతున్నప్పుడు సెల్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు ఆపేయాలి. విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలి.  

ముందుగా గుర్తించవచ్చా?
గతేడాది ఏప్రిల్‌1 నుంచి పిడుగుపాట్ల గురించి ముందుగానే హెచ్చరించేందుకు భారత వాతావరణ శాఖ చర్యలు చేపట్టింది. పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. దానికోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌, ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సార్ల ఏర్పాటు చేశారు. ఎక్కడ  పిడుగులు పడే అవకాశముందో వీటి ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో ప్రజల ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపి అప్రమత్తం చేస్తారు. అలా 30 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతంలోని వారిని హెచ్చరిస్తున్నారు.

ఏడాదిలో 34 శాతం పెరుగుదల
భారతదేశంలో ఏప్రిల్‌1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు185 లక్షల పిడుగులు పడ్డాయి. 2019-20లో 138 లక్షల పిడుగులు పడ్డాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఈసారి 34 శాతం అధికంగా పిడుగులు పడ్డాయి. గత ఏడాది కాలంలో 1,697 మంది మృతి చెందారని ఎల్‌ఆర్‌ఐసీ అనే ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన రెండో వార్షిక నివేదికలో తేలింది. బిహార్‌లో 401, ఉత్తరప్రదేశ్‌లో 238, మధ్య ప్రదేశ్‌లో 228 మంది, ఒడిశాలో 156 మంది చనిపోయారు. కనీసం 2022 నాటికైనా పిడుగుపాటుతో మరణించేవారి సంఖ్యను 1200లకు తగ్గించాలని ఆ సంస్థ ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే పంజాబ్‌లో పిడుగులు పడటం 331 శాతం పెరిగిందని, బిహార్‌లో 168, హర్యానాలో 164, పుదుచ్చేరిలో 117, హిమాచల్‌ ప్రదేశ్‌లో 105, పశ్చిమ్‌బెంగాల్‌లో 100 శాతం అధికంగా ఉందని తేలింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కాలంలో పిడుగులు పడటం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ నుంచి అక్టోబరు మధ్యన పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. బిహార్‌లో సెప్టెంబరులో పిడుగుపాట్లు నమోదవుతాయి. ఒడిశాలో జూన్‌లో పిడుగుపాట్లు ఎక్కువ. ఏదేమైనా తీవ్రమైన వాతావరణ మార్పులే పిడుగుపాట్లు పెరగడానికి కారణమనే సంగతి గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని