OPS: పన్నీర్‌ సెల్వం ఇంట విషాదం.. శశికళ ఓదార్పు

తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి విజయలక్ష్మి(63) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ......

Published : 01 Sep 2021 16:20 IST

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి విజయలక్ష్మి(63) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచినట్టు అన్నాడీఎంకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి పన్నీర్‌ సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌లను ఓదార్చారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రి దురైమురుగన్‌, అన్నాడీఎంకే సహ-సమన్వయకర్త, మాజీ సీఎం పళనిస్వామితో పాటు భాజపా, సీపీఐ, సీపీఎం, తదితర రాజకీయ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి వెళ్లి ఓపీఎస్‌ను పరామర్శించారు. ఓపీఎస్‌ సతీమణి మృతిపట్ల సంతాపం తెలిపిన నేతలు.. ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మరోవైపు, ఓపీఎస్‌ సతీమణి మరణవార్త తెలుసుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కూడా ఆస్పత్రికి వెళ్లారు. పన్నీర్‌ సెల్వం సతీమణి విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు. అనంతరం ఓపీఎస్‌ను పరామర్శించి.. ఓదార్చారు. ఆయన పక్కనే కూర్చొని విజయలక్ష్మీకి అందించిన వైద్య చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. శశికళ దాదాపు 20 నిమిషాల పాటు ఆస్పత్రి వద్దే ఉన్నట్టు సమాచారం. 

పన్నీర్‌ సెల్వం సతీమణి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం తేని జిల్లా పెరియాకుళంకు తరలించనున్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అన్నాడీఎంకే పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని