BRS: తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు

భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు.

Updated : 04 Apr 2024 16:00 IST

హైదరాబాద్‌: భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు.. చేర్పులు చేయాలని నిర్ణయించారు.

ఇందులో ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా.. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు. 

ట్రాఫిక్‌ సమస్య కూడా కారణం...

రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపునకు మార్చడానికి ట్రాఫిక్‌ సమస్య కూడా కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణ భవన్‌లోకి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఒకటి, రెండు వాహనాలు కూడా వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు.. చేర్పులు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని