Basara IIIT: వర్షంలోనూ కొనసాగుతోన్న బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 7వ రోజుకు చేరింది.

Updated : 20 Jun 2022 16:42 IST


బాసర: సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన 7వ రోజుకు చేరింది. వర్షంలో తడుస్తూనే విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వర్షంలో తడుస్తూ ట్రిపుల్‌ ఐటీ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు కూర్చుండిపోయారు. డిమాండ్లపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక వివరణ, లేదా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి రాతపూర్వక హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సతీష్‌ కుమార్‌, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ఫారూకీ నిన్న అర్ధరాత్రి క్యాంపస్‌కు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. తెల్లవారుజామున 3 గంటల వరకు చర్చలు జరిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని.. అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని అధికారులు విద్యార్థులకు చెప్పారు. అయితే అదే మాట సీఎంఓ, మంత్రులతో చెప్పించాలని వారిని విద్యార్థులు కోరారు. నిన్న అర్ధరాత్రి చర్చలు జరిగితే.. ఇప్పటివరకు మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ఐటీ వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని