Kishan Reddy: హైదరాబాద్‌ వేదికగా వ్యయసాయరంగంపై కీలక సమావేశాలు

జీ-20 దేశాల సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో 46 రంగాలపై అద్భుతమైన చర్చలు జరుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.

Published : 12 Jun 2023 17:48 IST

హైదరాబాద్‌: జీ-20 దేశాల సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో 46 రంగాలపై అద్భుతమైన చర్చలు జరుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ సహా ప్రపంచ దేశాలు ఈ సమావేశాలను ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. కరోనా తర్వాత ఉత్పన్నమైన అనేక రకాల అంశాలపై విస్తృత చర్చలకు జీ-20 వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం 46 రంగాలకు సంబంధించి 250కు పైగా సమావేశాలు భారత్‌లో సాగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 56 నగరాల్లో 140 సమావేశాలు ముగిశాయని తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల‌ 15 నుంచి 17 వరకు వ్యవసాయ రంగంపై సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది మంత్రుల సమావేశమని, భారత్ సహా 29 దేశాల మంత్రులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. అలాగే, 9 అతిథి దేశాల మంత్రులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. గోవా వేదికగా పర్యాటక, సాంస్కృతిక తుది సమావేశాలు జూన్ 19 నుంచి 4 రోజులపాటు జరుగుతాయని ప్రకటించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా అందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ప్రగతి మైదాన్‌ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన తుది సమావేశాలు జరుగుతాయని,  అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలకు 29 దేశాల అధినేతలు హాజరవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని