
కంట్లో రసాయనాలు పడితే ఇలా చేయండి!
ఇంటర్నెట్ డెస్క్: ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున లేదా ప్రమాదవశాత్తు రసాయనాలు, సున్నం, కారం, బ్లీచింగ్ పౌడర్ లాంటివి కళ్లలో పడుతుంటాయి. అలాంటప్పుడు కొందరు తెలిసో తెలియకో నాటు వైద్యం చేసి సమస్యను తీవ్రతరం చేసుకుంటారు. అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కళ్లను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
కళ్లలో రసాయనాలు పడడం అత్యంత ప్రమాదకరమైన సమస్య. సాధారణంగా కంటిలో ఏం పడినా మంట, వాపు, ఎర్రబడటం, నీరు కారడం వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటప్పుడు ప్రమాదం జరిగిన వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని శుభ్రంగా కడగాలి. కంట్లో ప్రమాద కారకాలు పడ్డప్పుడు మనం పాటించాల్సిన ప్రాథమిక సూత్రం ఇది. కంట్లో పడ్డ రసాయనాలు పోయేంత వరకూ కుళాయి కింద గానీ, షవర్ కిందగానీ నీళ్లతో బాగా శుభ్రం చేయాలి. ఇంట్లో అందుబాటులో ఉన్న చుక్కల మందులు వేయకూడదు. అలా చేయడం వల్ల మన కళ్లకు మనమే హాని చేసుకున్న వాళ్లమవుతాం. నీళ్లతో కంటిని శుభ్రం చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.