CM Revanth: డీఏ, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం: సీఎం రేవంత్‌

ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. 

Updated : 10 Mar 2024 22:14 IST

హైదరాబాద్‌: పదేళ్లుగా ప్రభుత్వానికి సమస్యలు విన్నవించే అవకాశం తెలంగాణలో ఉద్యోగులకు రాలేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీజీవో, టీఎన్‌జీవో, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. డీఏ, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు.

‘‘ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్‌ అందజేస్తాం. పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తాం. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలి. తెలంగాణను తామే సాధించామని ఏ ఒక్కరు చెప్పినా అది అసంబద్ధమే. విద్యార్థి, ఉద్యోగ, కార్మికులు, ప్రజల పోరాటంతో తెలంగాణ వచ్చింది. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్‌ అంటారు. ఆయన కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో. స్వరాష్ట్రం కోసం చాలా మంది ప్రాణాలు, రక్తం ధారపోశారు. తెలంగాణ ఆదాయం పడిపోయింది. ఆదాయం కోసం మద్యంపైనే ఆధారపడేలా కేసీఆర్‌ పాలన సాగింది.

మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. చిక్కుముడులు విప్పుతూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్లాం. రోజుకు 18 గంటలు పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నాం. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే.. ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందే. వారితో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోం. 1100 మంది రిటైర్డు ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే శాసనమండలికి గౌరవం. గవర్నర్‌తో చర్చించి కోదండరాంను మండలికి పంపుతాం’’ అని సీఎం రేవంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని