Amaravati: అంగన్వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం

వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Updated : 26 Dec 2023 20:49 IST

అమరావతి: వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం సాయంత్రం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనాలు పెంచాలని అంగన్వాడీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 1.64 లక్షల మందికి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని మంత్రుల కమిటీ తెలిపింది. గ్రాట్యుటీ అమలు కోసం హైకోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని మంత్రుల కమిటీ సూచించింది. సంక్రాంతి పండుగ తర్వాత ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని, అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరారు. వేతనాలు పెంచడంతో పాటు గ్రాట్యుటీ అమలు చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీ సంఘాలు తేల్చి చెప్పాయి.

సమావేశం ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని చెప్పాం. పండగ తర్వాత మరోసారి చర్చిద్దామని సూచించాం. మా విజ్ఞప్తుల పట్ల అంగన్వాడీలు సానుకూలంగా ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల సమయం కోరుతున్నామనేది సరికాదు’’  అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తాం..

ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో తమ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్టు సమావేశం ముగిసిన తర్వాత అంగన్వాడీ సంఘాలు తెలిపాయి. ‘‘15 రోజులుగా సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ఎలాంటి ఫలితంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడిస్తాం. సీఎం చొరవ తీసుకుని మా డిమాండ్లు నెరవేర్చాలి. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా ఆందోళన ఉద్ధృతం చేస్తాం’’ అని అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని