APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: ఆర్టీసీ ఎండీ

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు.

Published : 10 Jan 2024 21:52 IST

అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. ఒకవేళ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే సంస్థపై ఎంత భారం పడుతుందో వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. అమలుపై రాష్ట్ర ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇవాళ్టి నుంచి డోర్‌ డెలివరీ సదుపాయం..

సంక్రాంతి పండుగ కానుకగా బుధవారం నుంచి డోర్ డెలివరీ, డోర్ పికప్ లాజిస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎండీ తెలిపారు. ఇకపై లాజిస్టిక్స్ సేవలను ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే అనుకున్న ఫలితం రాలేదన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. www.apsrtclogistics.in వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదిస్తే డోర్ పికప్ ఉంటుందన్నారు. ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా మొదట విజయవాడలో ప్రారంభించామన్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. రెండు వైపులా ప్రయాణానికి రిజర్వేషన్‌ చేసుకుంటే టికెట్‌ ధరపై పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో సరికొత్త హంగులతో 1500 సూపర్‌ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని