hyderabad: సింహాలకు సార్స్‌ కొవ్‌-2

హైదరాబాద్‌ నగరంలోని జూ పార్కులో వైరస్‌ కలకలం రేపుతోంది. ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు రావడం ఆందోళన కలిగించింది

Updated : 04 May 2021 17:30 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలోని జూ పార్కులో వైరస్‌ కలకలం రేపుతోంది. ఎనిమిది సింహాలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు రావడం ఆందోళన కలిగించింది. సింహాలకు కరోనా లక్షణాలు కన్పించడంతో వాటి నమూనాలు సేకరించిన అధికారులు వాటిని సీసీఎంబీకి పంపించారు. వాటిని పరిశీలించిన వైద్య నిపుణులు మృగరాజులకు సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ సోకినట్టు వెల్లడించారు. ఇది కొవిడ్‌ కాదని, సార్స్‌ కొవ్‌-2గా దీన్ని వ్యవహరిస్తారని వైద్యులు తెలిపారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సింహాల ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు జూ పార్కులను ఇప్పటికే అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే.

ఏపీలో జూలు మూసివేత

మరోవైపు, ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలు మూసివేశారు. సందర్శకులు, జంతువుల రక్షణ దృష్ట్యా జూలు, పార్కులు, నగర వనాలు, ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్‌ ఎకో పార్కులు మూసివేశారు. కేంద్ర అటవీశాఖ ఆదేశాల మేరకు మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనా దృష్ట్యా విశాఖ, తిరుపతిలలో జూ పార్కులను మూసివేశారు. 29 ఎకో టూరిజం సెంటర్లతో పాటు 23 నగర వనాలు మూసేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం (నేటి) నుంచి 7 టెంపుల్‌ ఎకో పార్కులు మూసివేయాలని ఆదేశించారు. జంతువుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని