
Ts News: ప్రగతిభవన్ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: సందర్భానుసారంగా అప్పుడప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమవుతుంటారు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. ఇవాళ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ వద్దకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న జేసీ దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కేటీఆర్‌ను కలవాలని.. లోపలికి అనుమతించాలని పోలీసులను కోరారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్‌లోకి అనుమతించేది లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. కాసేపు అక్కడే ఉన్న జేసీ.. లోపలికి సమాచారం పంపాలని మరోసారి కోరారు. ముందస్తు అనుమతి తప్పనిసరని.. అలా కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో దివాకర్ రెడ్డిని పోలీసు వాహనంలో ఆక్కడి నుంచి తీసుకెళ్లారు. మధ్యలో పోలీసు వాహనం దిగిన జేసీ.. తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు.
గతంలోనూ పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలను కలిసేందుకు జేసీ తెలంగాణ అసెంబ్లీకి వచ్చి వారితో కాసేపు ముచ్చటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తా. మేం తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాం. రాయల తెలంగాణ కావాలని నాడు జైపాల్‌రెడ్డిని అడిగితే ఒప్పుకోలేదు’’ అని జేసీ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి సైతం గురయ్యారు.