ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Published : 13 Dec 2020 10:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో  ఒకరు మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొక మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది.

కటాఫ్ ఏరియా ప్రాంతంలోని ఎగజనసభ సమీపంలో సింగారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు ముందుగా సమాచారం అందండంతో ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, డీవీఎఫ్‌ బలగాలు గాలింపు చేపట్టారు. ఈ తెల్లవారుజామున పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో 12 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు సమాచారం. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా, 10 మంది మావోయిస్టులు ఘటనా స్థలం నంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. దీంతో విశాఖ జిల్లా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన ప్రాంతం చింతపల్లికి సమీపంలో ఉండటంతో తప్పించుకున్న మావోయిస్టుల కోసం  భద్రతా బలగాలు అటవీప్రాంతంలో మోహరించాయి. పీఎల్జీ వారోత్సవాల ముందు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, నెల రోజుల వ్యవధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని