మతాన్ని ఓడించిన మానవత్వం!

అమ్మకు ప్రేమతో చివరి మజిలీ

Published : 04 Jun 2021 23:46 IST

‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా...! కన్న అమ్మే కదా...!’ అన్న ఓ సినీ కవి మాటలు నిజం చేసిందా కుటుంబం. కేవలం ఐదేళ్ల పరిచయంతోనే తల్లీ బిడ్డగా అన్యోన్యంగా కలిసిపోయారు. అమ్మగా భావించిన వృద్ధురాలు అనారోగ్యం పాలైతే.. అన్నీ తానై చూసుకున్నారు. ఆమె దూరమయ్యాక మతాలు వేరైనా ఆ మాతృమూర్తికి దహన సంస్కారాలు, దశదిన కర్మలు శాస్ర్తోక్తంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆమె పేరు గాంధారమ్మ. విశాఖ బీచ్‌రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో నివాసముండేవారు. ఇక్కడే కేరళకు చెందిన అల్తాఫ్‌ కుటుంబం నివసించేది. అల్తాఫ్‌ కుటుంబానికి పరిచమైన గాంధరమ్మను కన్నతల్లిలా ఆదరించారు. ఆమె కూడా అతడిని కన్నబిడ్డలా చూసుకున్నారు. ఐదేళ్లుగా వీరు తల్లీబిడ్డలుగా కలసిమెలసి ఉన్నారు. గతనెలలో గాంధారమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అల్తాఫ్‌ దంపతులు మాతృమూర్తిగా భావించిన గాంధారమ్మకు రాత్రిపగలూ సేవలు చేశారు. కానీ విధి ఆడిన నాటకంలో ఆమె ఓడిపోయింది.

లాక్‌డౌన్‌ వల్ల కన్నతల్లి అంత్యక్రియలకు గాంధరమ్మ కుమారుడు రాలేకపోయాడు. అయితే అల్తాఫే అన్ని తానై ఆ మాతృమూర్తికి చివరి మజిలీ నిర్వహించారు. ఇరువురి మతం వేరైనా హిందూ సంప్రదాయం ప్రకారం, కొడుకులాగా ఆ తల్లికి అంతిమసంస్కారాలు శాస్ర్తోక్తంగా కాకినాడలో నిర్వహించారు. ఆమె కుమారుడు, కుమార్తె సమక్షంలో స్వయంగా పిండప్రదానాలు, తర్పణాలు వదిలారు. అనంతరం సముద్రస్నానాలు చేశారు. మతాలు వేరైనా తల్లీ కుమారుడి ప్రేమకు నిదర్శనంగా నిలిచారు. ఈ విషయంలో అల్తాఫ్‌ భార్య ముస్ర్తీయాని కూడా భర్తకు సహకరించారు. 

మనిషికి మనిషే సాయపడాలి: అల్తాఫ్‌
‘‘మా ఇంటి పక్కనే ఉన్నా.. కుటుంబ సభ్యురాలిగా భావించాం ఆమెను. 84ఏళ్లు ఆమెకు. రెండేళ్లుగా అమ్మకి ఆరోగ్యం బాగోకపోవడం.. ఇటీవల మరింత క్షీణించడంతో ఆమె చనిపోయారు. మనిషికి మనిషే సాయపడాలి. అక్కడ మతం, కులం అడ్డురాకూడదు అనే ఉద్దేశంతో మేం దీనికి పూనుకున్నాం’’ అని చెప్పారు. సంప్రదాయం ప్రకారం తమ తల్లికి అంతిమ సంస్కారాలు, దశదిన కర్మను నిర్వహించినందుకు గాంధారమ్మ బిడ్డలు  అల్తాఫ్‌ను అభినందించారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని