ప్రశాంతంగా ముగిసిన ‘పుర’ పోలింగ్‌

తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.  రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌  కేంద్రాల వద్ద వరుసలో నిలబడిన వారికి అధికారులు...

Updated : 22 Jan 2020 19:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.  రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌  కేంద్రాల వద్ద వరుసలో నిలబడిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. 7613 పోలింగ్‌ కేంద్రాల్లో బుధవారం పోలింగ్‌ కొనసాగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.  వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల వాగ్వాదాలు, గోడవలు చోటుచేసుకున్నాయి. తెరాస, మజ్లిస్‌, కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఘర్షణకు దిగగా పోలీసులు వారిని శాంతింపజేశారు. పలుచోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కి దారితీసింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం సమయానికి పుంజుకుంది.

 

మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మధ్యాహ్నం 3 గంటల వరకు 67.46 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.  మొత్తం 120 మున్సిపాల్టీల్లోని 2,727 వార్డులకు గాను ఇప్పటికే 80 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,647 వార్డులకు పోలింగ్‌ జరిగింది. 9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు గాను  ఒక డివిజన్‌ ఏకగ్రీవమైంది. మిగిలిన 324 డివిజన్లకు బుధవారం పోలింగ్‌ జరిగింది. పుర పోరు బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని అభ్యర్థులు బ్యాలెట్‌ బాక్స్‌లలో నిక్షిప్తంచేశారు.  జీహెచ్‌ఎంసీ డబీర్‌పురా డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ కూడా ముగిసింది. శనివారం ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 11,099 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.  

మరోవైపు, కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అక్కడ 60 కార్పొరేట్‌ స్థానాలకు ఈ నెల 24న పోలింగ్‌ జరగనుంది. కరీంనగర్‌లో ఈ నెల 27న  ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

 

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని