యువతే దేశ భవిష్యత్తు: తమిళిసై

ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే దేశ సాంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యువతకు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్‌...

Updated : 23 Jan 2020 19:48 IST

హైదరాబాద్: ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే దేశ సాంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యువతకు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ్‌ భారత్‌’ పేరుతో నిర్వహించిన యూత్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... యువత ఏ రంగాన్ని ఎంచుకున్నా సంతోషంగా ముందుకు సాగాలని, నవ భారత నిర్మాణంలో ఉత్సాహంగా పాలు పంచుకోవాలని సూచించారు. అనుకున్న రంగంలో రాణించలేనప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవాలే తప్ప ఆత్మహత్యలు వంటి చర్యలకు పాల్పడకూడదని హితవు పలికారు. సుభాష్‌ చంద్రబోస్‌ యువతకు ఇచ్చిన సందేశాలను ఈ సందర్భంగా గవర్నర్‌ గుర్తు చేశారు. 

సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ గవర్నమెంట్‌ సర్వీస్‌ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికీ స్వాతంత్ర్య భారత్‌లో పనిచేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని సైతం వదులుకున్న గొప్ప వ్యక్తి అని గవర్నర్‌ కొనియాడారు. యువతే దేశ భవిష్యత్‌ అని, దేశంలో 70 శాతం జనాభా యువతే ఉండటం శుభపరిణామమని ఆమె అభిప్రాయపడ్డారు. తాను వైద్యురాలిగా నైపుణ్యం సాధించేందుకు విదేశాల్లో కోర్సులు చేసినప్పటికీ.. తన సేవలు స్వదేశంలోనే అందించినట్లు తెలిపారు. అంతకు ముందు  సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి గవర్నర్‌ తమిళిసై పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గాంధీ తర్వాత నేతాజీనే: బిశ్వభూషణ్‌
విజయవాడ: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో ప్రధాన పాత్ర మహాత్మాగాంధీ పోషిస్తే.. ఆ తర్వాతి స్థానం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌దేనని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల్లో గవర్నర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరంలో నేతాజీ సేవలను గవర్నర్‌ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర యోధుడిగా.. యువతలో స్ఫూర్తిని నింపిన వ్యక్తిగా చంద్రబోస్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. నేతాజీపై ప్రముఖ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు రాసిన పుస్తకాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని