అత్యవసర మినహా మిగతా సేవలన్నీ రద్దు

దేశవ్యాప్తంగా అత్యవసర మినహా అన్ని సేవలను నిలిపివేయాలని ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.అనంతరం దీనికి అనుగుణంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 25 Mar 2020 01:42 IST

మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ


దిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర మినహా అన్ని సేవలను నిలిపివేయాలని ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎమ్‌ఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.అనంతరం దీనికి అనుగుణంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం  రక్షణ, కేంద్ర పారా మిలటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వతంత్ర వ్యవస్థలన్నీ మూసివేయాలి. రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మినహా అన్ని సేవలు నిలిపివేయాలి. ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్‌లు, అంబులెన్స్ లు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి నిబంధనలను సడలించారు. రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలకు కూడా మినహాయింపు వర్తించనుంది. 

బ్యాంక్‌లు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇ కామర్స్‌ ద్వారా ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసే వారికి, పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలకు, క్షేత్ర స్థాయిలో విద్యుత్ రంగ ఉద్యోగులతోపాటు, శీతల కేంద్రాలు, గిడ్డంగులకు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, నిత్యావసరాల తయారీ యూనిట్లకు మినహాయింపు వర్తించనుంది.ఇతర ఉత్పత్తుల సంస్థలు తమ కార్యకలాపాలను సాగించేందుకు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రం పేర్కొంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేయాలని స్పష్టం చేసింది. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాల్సిందేని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించినవారు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులవుతారని కేంద్రం వెల్లడించింది.   కేంద్రం పేర్కొన్న ఈ నిబంధనలన్నీ అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యతను జిల్లా న్యాయాధికారికి అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని