Updated : 26 Mar 2020 19:32 IST

కరోనాపై పోరులో ఇవన్నీ విజయాలే..! 

ఇప్పుడు ఏ నోట విన్నా కరోనా.. కరోనా! తెల్లారితే బాధితుల సంఖ్య ఎంత పెరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చనిపోయారు? దేశంలో ఎంతమందికి కరోనా పాజిటివ్‌ తేలింది? ఇలాంటి ప్రశ్నలే సగటు జీవికి ఎదురవుతున్నాయి. దీంతో కొందరు భయభ్రాంతులకు గురౌతున్నారు. భవిష్యత్తును ఊహించుకోవడానికే  భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆందోళనకన్నా గుండెనిబ్బరం అవసరం. ఏమౌతుందోనన్న అనుమానం కన్నా.. ఎదిరించగలమన్న పోరాట స్ఫూర్తి అవసరం. మీలో అలాంటి పట్టుదల నింపే కొన్ని కరోనా ‘పాజిటివ్‌’ (ఊరటనిచ్చే) అంశాలు మీకోసం..


కోలుకుంటున్న బాధితులు

* కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25వ తేదీ నాటికి సుమారు 19 వేల మంది చనిపోయారు. 4.38 లక్ష మంది పైచిలుకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే, వైరస్‌ బారిన పడినవారంతా చనిపోతారన్న అనవసర భయాలు అక్కర్లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే కరోనా పాజిటివ్‌ అని తేలిన వారిలో సుమారు లక్ష మంది కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఈ వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో 81 వేల మంది ఈ వైరస్‌ బారిన పడగా.. 3,160 మంది మరణించారు. అదే సమయంలో 60 వేలమంది కోలుకోవడం గమనార్హం.

* దేశ రాజధాని దిల్లీలో గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. దిల్లీలో 30 కేసులు నమోదు కాగా.. అందులో ఐదుగురు కోలుకున్నారని కూడా తెలిపారు. దేశంలో 42 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని బుధవారం కేంద్రం ప్రకటించింది.

* కరోనా విలయతాండవం చేస్తున్న ఇటలీలో మరణాలు సంఖ్యలో తగ్గుదల కనిపించడం ఊరటనిచ్చే అంశం. శనివారం 793 మరణాలు సంభవించగా.. ఆదివారం నాటికి ఆ మరణాలు సంఖ్య 651కి చేరింది. సోమవారం 601కి చేరడం గమనార్హం. అందుకు ఆ దేశం అమలు చేస్తున్న కఠిన నిర్బంధమే కారణం. మన దేశంలోనూ ఈ 21 రోజులూ సమర్థంగా మనం ఆ పని చేయగలిగితే మహమ్మారిని తరిమికొట్టడం పెద్ద విషయమేమీ కాదు.


నివారణకు ఔషధాలు

* కరోనాను పూర్తిగా నయం చేసే ఔషధాలు ఇంకా కనిపెట్టలేదన్న ఆందోళన ఉన్నా.. అందుకు వేగంగా జరుగుతున్న పరిశోధనలు.. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఊరట మనకు కల్పించేవే.

* కరోనా మహమ్మారిపై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో ముందుజాగ్రత్తల్లో భాగంగా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చునని పేర్కొంది. వైద్యుల సూచనల మేరకే దీనిని ఉపయోగించాలి.  ( ఇదీ చదవండి.. కొవిడ్‌ నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌)

*  దాదాపు అయిదు దశాబ్దాలుగా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమై ఉన్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కరోనా వైరస్‌ వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. ఇవి ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరాయని పేర్కొంది. త్వరలో మనుషులపై కూడా ప్రయోగాలు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ అదార్‌ పూనావాలా తెలిపారు. (ఇదీ చదవండి.. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాం)

* కరోనా వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు  అమెరికా అధ్యక్షుడు కొన్నాళ్ల కిందటే ట్రంప్‌ ప్రకటించారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయికతో చికిత్స కరోనాను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి  మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.


ప్రభుత్వం సత్వర నిర్ణయాలు

* కరోనా వ్యాప్తి నియంత్రణలో మన ప్రభుత్వం వేగంగా చర్యలు ఆరంభించింది. ఇందుకు ప్రైవేటు కంపెనీలనూ భాగస్వామ్యం చేసింది. దోపిడీకి కళ్లెం వేసేలా పలు నిర్ణయాలు తీసుకుంది.

* కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. దీంతో భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షకు అధికారిక అనుమతి గల ప్రైవేటు ల్యాబ్‌ల సంఖ్య 16కు పెరిగింది.

* కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలకు వసూలు చేయవలసిన అత్యధిక మొత్తం రూ.4,500గా కేంద్రం ప్రకటించింది. (ఇదీ చదవండి.. కరోనా పరీక్షలకు 16 ప్రైవేటు ల్యాబ్‌లు)

* శానిటైజర్లు, మాస్కులు ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంది.

* పుణె కేంద్రంగా పనిచేసే స్టార్టప్‌ సంస్థ మైల్యాబ్‌ రోజుకు 10వేల నుంచి 15 వేల పరీక్షలకు అసవరమైన కిట్స్‌ను ఉత్పత్తి చేస్తామని చెప్పింది. కరోనా వైరస్‌ను చౌకలో గుర్తించే ఒక విధానాన్ని దిల్లీలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం కంటే తక్కువ ధరలోనే పరీక్షలు చేయవచ్చని ప్రకటించారు. ఆపత్కాలంలో ఇలాంటి అంశాలు ఊరట కల్పిస్తానయడంలో సందేహం లేదు.


కార్పొరేట్లు ముందుకు..

* ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం అధికమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్లూ తమ వంతుగా కరోనాపై పోరులో భాగస్వామ్యులను చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  దీనికి తోడు పలు కార్పొరేట్‌ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.

* కార్పొరేట్‌ సంస్థలు వెచ్చించే నిధులను కంపెనీల చట్ట ప్రకారం కార్పొరేట్‌ సామాజిక బాధ్యతా (సీఎస్‌ఆర్‌) వ్యయాలుగా పరిగణిస్తూ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ నివారణ చర్యలు కూడా ఇందులో భాగమయ్యేలా కంపెనీల చట్టంలో మార్పులు చేశారు. ఇది కార్పొరేట్లు ముందుకు రావడంతో పాటు నిధుల కొరతను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. లాభాలు ఆర్జిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 2 శాతం లాభాన్ని సీఎస్‌ఆర్‌ కింద వెచ్చించాల్సి ఉంటుంది.

* కరోనాపై పోరులో వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు మాస్కుల ఉత్పత్తిని రోజుకు లక్షకు పెంచుతున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. పెద్ద సంఖ్యలో రక్షణాత్మక సూట్‌లు, దుస్తులను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్‌-19 రోగులు, క్వారంటైన్‌ వ్యక్తులను రవాణా చేసే అత్యవసర సేవల వాహనాలకు ఉచితంగా ఇంధనం అందిస్తామని, ప్రస్తుత సంక్షోభంతో జీవనోపాధి దెబ్బతిన్నవారికి.. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అనేక నగరాల్లో ఉచిత భోజనం సరఫరా చేస్తామని వెల్లడించింది.

* రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులు, పోలీసులకు ఎన్‌ 95 మాస్కులు, ప్రొటెక్టివ్‌ సూట్‌లు సరఫరా చేస్తామని స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమి ఇండియా ఎండీ మను జైన్‌ తెలిపారు. కర్ణాటక, పంజాబ్‌, దిల్లీ ప్రభుత్వాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు, పోలీసులకు లక్షల సంఖ్యలో వీటిని పంపిణీ చేస్తామని వెల్లడించారు. 

* కరోనా తీవ్రత పెరిగితే వెంటిలేటర్ల కొరత ఏర్పడుతుందన్న దృష్టితో వాటిని సిద్ధం చేసే పనిలో తమ కంపెనీ నిమగ్నమైందని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. అంతేకాదు తమ రిసార్టులను కూడా తాత్కాలిక సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో నష్టపోయే చిన్నతరహా వ్యాపారులను ఆదుకొనేందుకు తన శక్తిమేరకు సాయం చేస్తానని చెప్పారు. దీనికోసం తన నెల జీతం మొత్తంతోపాటు రాబోయే కొన్ని నెలల జీతంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నానని వెల్లడించారు. తొలుత స్పందించిన కార్పొరేట్‌ దిగ్గజం కూడా ఆనంద్‌ మహీంద్రానే.


నేతలూ, ప్రముఖులూ తమవంతు..

* తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించేందుకు ప్రతి ఎంపీకి నిధులు కేటాయిస్తారు. కేవలం సొంత నియోజకవర్గ అభివృద్ధికి కొందరు వీటిని వినియోగిస్తుంటారు. మరికొందరు ఖర్చు చేయకుండా వదిలేస్తుంటారు. ఇలాంటి కీలక సమయంలో కరోనాపై పోరుకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు వెచ్చిస్తామని కొందరు ఎంపీలు ముందుకు రావడం గమనార్హం. సినీ ప్రముఖులు సైతం కష్టకాలంలో మేమున్నాం అంటూ ముందుకు వస్తున్నారు. 

* కరోనా రిలీఫ్ ఫండ్‌కు తెరాస ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి రూ.500 కోట్లు సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. రెండు నెలల వేతనం కూడా ఇచ్చేందుకు వారు ముందుకొచ్చారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రూ.50 లక్షలు కేటాయించారు.

* ఏపీలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఎంపీ నిధుల నుంచి రూ.4కోట్లు కేటాయిస్తున్నట్టు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఒక నెల జీతంతో పాటు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 70 లక్షలు అందిస్తామని ప్రకటించారు.

* తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు కుటుంబం విరాళం కింద రూ.10 లక్షలు ప్రకటించింది.

* సినిమా హీరోలు సైతం విరాళాలు అందిస్తున్నారు. చిత్ర పరిశ్రమపై ఆధారపడుతున్న వారిని ఆదుకోవడమే కాక సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తమ వంతు సాయం ప్రకటించి అండగా నిలుస్తున్నారు.


మనం చేయాల్సిందిదీ..

1.ఆదిలాబాద్ జిల్లాలో రెండు చిన్న గ్రామాలకు చెందిన ప్రజలు కరోనా నేపథ్యంలో పొలాల్లో నివాసం ఉంటున్నారు. గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి రావడంతో ముందు జాగ్రత్తగా పొలాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఒక్కరో కాదు.. ఏకంగా 120 కుటుంబాలు పొలాల పంచన చేరడం గమనార్హం.

2. కరోనా వైరస్‌ నియంత్రణకు సామాజిక దూరమే పరమౌషధం అని ఐసీఎంఆర్‌ ప్రకటించింది. అందరూ సామాజిక దూరం పాటిస్తే 62 శాతం కేసుల్ని తగ్గించొచ్చని పేర్కొంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలా వ్యవహరించాలి? అనడానికి ఈ రెండు అంశాలే కీలకం. చదువుకున్న వారే జబర్దస్త్‌గా రోడ్లపైకి వచ్చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరంతో కరోనాకు ఎలా దూరంగా ఉండొచ్చో ఈ గ్రామస్థులు చాటుతున్నారు. సామాజిక దూరమే అసలైన మార్గమని కేంద్రం సైతం చెబుతోంది. 21 రోజులు దూరంగా ఉండాలని చెప్పడం వెనుక అసలు ఆంతర్యం అదే. అందుకే లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమై దేశాన్ని కాపాడుకుందాం! కరోనాను తరిమికొడదాం!!

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని