నా వేలు పట్టుకున్నప్పుడే భరోసా ఇచ్చాను

కరోనా లాక్‌డౌన్ కాలంలో వైద్యులు, పోలీసులే ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటున్నారు.

Published : 12 Apr 2020 00:42 IST

 

ముంబయి: కరోనా లాక్‌డౌన్ కాలంలో వైద్యులు, పోలీసులే ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటున్నారు. మహారాష్ట్రలోని ఆలీబాగ్‌లో కూడా ఓ వైద్యుడి అప్రమత్తత అప్పుడే పుట్టిన చిన్నారి ప్రాణాన్ని నిలిపింది. ఆ బిడ్డలో శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతో స్వయంగా వైద్యుడే ద్విచక్రవాహనం మీద ఆసుపత్రి తీసుకెళ్లి తన వృత్తికి మరింత గౌరవం తెచ్చారు.   
శుక్రవారం అలీబాగ్‌కు చెందిన  శ్వేతా పాటిల్ అనే మహిళలకు పురిటి నొప్పులు రావడంతో లాక్‌డౌన్‌ కారణంగా ఆమె భర్త దగ్గర్లో ఉన్న నర్సింగ్‌ హోమ్‌కు తీసుకెళ్లారు. ఆమెకు మధుమేహంతో కూడా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం వచ్చిందని ఆమె భర్త వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవేమీ కుదర్లేదు. అంతేకాకుండా శ్వాస సంబంధ సమస్యలతో గతంలో ఆమె తన మొదటి బిడ్డను కోల్పోయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఆమె మెడికల్ హిస్టరీ తెలిసిన నర్సింగ్ హోమ్ వైద్యుడు ముందు జాగ్రత్తగా పిల్లల వైద్యుడు రాజేంద్రను అందుబాటులో ఉంచారు.  తరవాత ఆమెకు సిజేరియన్ చేయగా, పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. పుట్టిన పిల్లాడిని గమనించిన వైద్యుడు అంతా బాగానే ఉందని తల్లిదండ్రులకు వెల్లడించారు. అయితే అంతలోనే శిశువుకు శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతోపాటు, శరీరమంతా నీలంగా మారింది. ఆ చిన్నారికి అత్యవసరంగా నియోనాటల్ కేర్‌ అవసరమని రాజేంద్ర గుర్తించారు.  కానీ లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ద్విచక్రవాహనం మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువుకు వైద్యం అందించి, కోలుకున్న తరవాత ఆయన మాట్లాడుతూ.. ‘ఆ శిశువుకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌ యూనిట్‌లో చికిత్స అందించాను. 12 గంటల తరవాత అంతా సద్దుమణిగింది. ఇది నాకు గొప్ప అనుభవం. నేను వైద్యం చేసేప్పుడు ఆ చిన్నారి నా వేలును గట్టిగా పట్టుకున్నాడు. నీకేంకాదు అనే ధైర్యాన్ని వాడికి ఇవ్వాలనుకున్నాను’ అని సంతోషంగా వెల్లడించారు. 

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని