అందుకే మద్యం ధరలు పెంచాం: శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌

Updated : 06 May 2020 17:14 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు నెలన్నర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందు బాబులు మద్యం కోసం దుకాణాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో నాంపల్లి అబ్కారీ భవన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మద్యం అందుబాటులో లేకపోతే మళ్లీ గుడుంబా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలా జరగకూడదనే రాష్ట్రంలో గుడుంబా నివారణకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. జడ్చర్లలో గుడుంబా తయారీని అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిపై దాడి చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరిచాయి. రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చింది. ఇప్పటివరకు అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వారిపై 2,409 కేసులు నమోదు చేసి 2,089 మందిని అరెస్టు చేశాం. దాదాపు 11,130 లీటర్ల గుడుంబాను సీజ్‌ చేశాం. ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సరిహద్దుల మీదుగా లారీల కొద్ది బెల్లం అక్రమంగా రవాణా చేస్తున్నారు. మరోవైను సారాకు కలర్‌ కలిపి విస్కీలా విక్రయిస్తున్నారు. కల్తీ మద్యాన్ని బ్రాండ్ పేరు మార్చి అమ్ముతున్నారు. ఇది ఒక మాఫియాలా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఉన్నతాధికారులు, మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నాకే మద్యం దుకాణాలు తెరావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు’’ అని మంత్రి వివరించారు.

రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదని.. తగినన్ని నిల్వలు ఉన్నాయని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పక్క రాష్ట్రంలో 75 శాతం వరకు మద్యం ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో సగటున 16శాతం పెంచామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించినట్లు చెప్పారు. నగరంలో దుకాణాల వద్ద పరిస్థితులను పరిశీలించి నిబంధనలు పాటించని 28 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్‌ రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. మాస్కులు లేని వారికి మద్యం విక్రయించరాదని.. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని