మనసు దోసెన్‌!

వేడివేడి దోసెకు కాస్త కొబ్బరి చట్నీ అద్ది... అలా నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. వీటికి అదనపు హంగులనూ అద్దితే... ఆ రుచికి అద్భుతః అనకుండా ఉండలేరు. ఇవన్నీ అలాంటివే మరి...

Updated : 07 Feb 2021 06:49 IST

వేడివేడి దోసెకు కాస్త కొబ్బరి చట్నీ అద్ది... అలా నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. వీటికి అదనపు హంగులనూ అద్దితే... ఆ రుచికి అద్భుతః అనకుండా ఉండలేరు. ఇవన్నీ అలాంటివే మరి...

పావ్‌భాజీ దోసె

కావాల్సినవి: దోసె పిండి- రెండు గరిటెలు, పావ్‌భాజీ మసాలా- నాలుగు టీస్పూన్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్‌, టొమాటో- ఒక్కోటి చొప్పున, ఉడికించిన బఠానీలు- అరకప్పు, వెల్లుల్లి తరుగు- టీస్పూన్‌, షెజ్వాన్‌ సాస్‌- నాలుగు టేబుల్‌స్పూన్లు, ఆమ్‌చూర్‌ పొడి- రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి పేస్టు- టీస్పూన్‌, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప- ఒకటి, కొత్తిమీర తరుగు- నాలుగు టీస్పూన్లు, వెన్న- నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారీ: నాన్‌స్టిక్‌ పాన్‌ను వేడిచేసి వెన్న రాసి దోసె వేయాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌, బఠానీ ముక్కలు వేసి.. అవి దోసెకు అతుక్కునేలా ఒత్తాలి. తర్వాత టొమాటో ముక్కలు, వెల్లులి చల్లాలి. ఇప్పుడు షెజ్వాన్‌సాస్‌లో పావ్‌భాజీ మసాలా, ఆమ్‌చూర్‌పొడి, పచ్చిమిర్చిపేస్టు వేసి కలిపి దాన్ని దోసె మీద వేయాలి. బంగాళాదుంప పేస్టు, వెన్న వేసి దోసె మొత్తం రాయాలి. కొంచెం ఉప్పు, కొత్తిమీర తరుగువేసి దోసె పైన నాలుగోవంతు మసాలాను ఉంచి మిగతాది వేరే ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత దోసె మీద కాస్త వెన్న వేసి మడత పెట్టాలి.


నీర్‌ దోసె

కావాల్సినవి: బియ్యం- కప్పు, కొబ్బరి తురుము- పావుకప్పు, ఉప్పు- సరిపడా.
తయారీ: బియ్యాన్ని కడిగి మూడు గంటలపాటు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. పాన్‌ మీద నూనె వేసి వేడిచేయాలి. ఇప్పుడు పాన్‌ అంతా పరుచుకునేలా దోసె వేయాలి. మధ్యలో ఖాళీలు ఉంటే వాటిల్లోనూ పిండి వేయాలి. దీన్ని తక్కువ మంట మీద నిమిషం పాటు వేయించాలి. బాగా వేగిన తర్వాత నాలుగు మడతలు వేసి తీసేయాలి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.


ఎగ్‌ దోసె

కావాల్సినవి: దోసె పిండి- రెండు గరిటెలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ- ఒకటి, పసుపు, మిరియాలపొడి, కారం- టీస్పూన్‌ చొప్పున, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు- రెండు టీస్పూన్లు, గుడ్లు- రెండు.  
తయారీ: కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి. పాన్‌ వేడిచేసి నూనె రాసి రెండు గరిటెల దోసె పిండి వేయాలి. దోసె మీద కారం, మిరియాలపొడి చల్లాలి. ఇప్పుడు రెండు గుడ్లను పగలగొట్టి దోసె మీద వేసి అంతా పరచాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లాలి. మిగిలిన కారం పొడిని గుడ్ల సొన మీద వేసి, ఉల్లిపాయ ముక్కలూ చల్లాలి.  దోసె చుట్టూ నూనె కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చి తీయాలి.


నూడుల్‌ దోసె

కావాల్సినవి: ఉడికించిన నూడుల్స్‌- రెండు కప్పులు, దోసె పిండి- రెండు గరిటెలు, సన్నగా తరగిన ఉల్లిపాయ- ఒకటి, కోసిన పచ్చిమిర్చి- ఒకటి, సన్నగా తరగిన అల్లం- చిన్నముక్క, సన్నగా, పొడవుగా కోసిన క్యారెట్‌, క్యాప్సికమ్‌- ఒకటి చొప్పున, క్యాబేజీ తురుము- అరకప్పు, టొమాటోసాస్‌- టేబుల్‌స్పూన్‌, సోయాసాస్‌- టీస్పూన్‌, రెడ్‌, గ్రీన్‌చిల్లీసాస్‌- అర టీస్పూన్‌ చొప్పున, ఉప్పు- తగినంత, వెనిగర్‌- అర టీస్పూన్‌, కొత్తిమీర తరుగు- రెండు టేబుల్‌స్పూన్లు,
తయారీ: కడాయిలో నూనె పోసి వేడి చేసి ఉల్లిపాయ, క్యారెట్‌, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజీ తురుము వేయించాలి. దీంట్లో తగినంత ఉప్పు, ఉడికించిన నూడుల్స్‌ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. దీంట్లో వెనిగర్‌, కొత్తిమీర తరుగు వేసి దించేయాలి. ఇప్పుడు పాన్‌ వేడిచేసి దోసె వేసి మధ్యలో రెండు టేబుల్‌స్పూన్ల నూడుల్స్‌ వేసి మడత పెట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని