Corona virus: చిన్న తెగలకు కొవిడ్‌ ముప్పు ఎక్కువ!

చిన్నచిన్న సమూహాలకు, తెగలకు చెందినవారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా అండమాన్‌ సహా పలు ప్రాంతాల్లో చిన్న చిన్న తెగలు నివసిస్తున్నాయి.

Published : 14 Oct 2021 12:01 IST

 సీసీఎంబీ పరిశోధకుల అంచనా  
జన్యు వైవిధ్యం లేకపోవడమే కారణం 
 సీడీఎఫ్‌డీ డైరెక్టర్‌ డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ వెల్లడి 

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నచిన్న సమూహాలకు, తెగలకు చెందినవారికి కొవిడ్‌ ముప్పు ఎక్కువని తాజా పరిశోధనలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా అండమాన్‌ సహా పలు ప్రాంతాల్లో చిన్న చిన్న తెగలు నివసిస్తున్నాయి. వీరు ఎక్కడో అడవులు, కొండల వంటి మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరి జనాభా పరిమితంగానే ఉంటుంది. వారిలోవారే వివాహాలు చేసుకుంటుంటారు. ఇలాంటి సమూహాల్లో జన్యు వైవిధ్యం ఎక్కువగా ఉండదు. ఫలితంగా వీరికి పుట్టబోయే సంతానంలో జన్యుపర సమస్యలకు ఆస్కారం ఎక్కువ. దీనివల్ల కొవిడ్‌ వైరస్‌ సొకే ముప్పు సైతం ఎక్కువేనని సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) పరిశోధకులు తాజా అధ్యయనాలతో అంచనాకు వచ్చారు. కరోనా వైరస్‌ సంక్రమణ ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతులపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రెజిల్‌లోని కొన్ని తెగల్లో మరణాల రేటు రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భారత్‌లోనూ వేల సంవత్సరాల నుంచి కొన్ని సమూహాలు ఒంటరిగా అండమాన్‌ దీవులతో సహా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. ఈ జాతులకు కొవిడ్‌ ముప్పు ఏ మేరకు ఉందనే విషయమై ఆయా సమూహాల నుంచి సేకరించిన డీఎన్‌ఏ సమాచారం ఆధారంగా పరిశోధకులు విశ్లేషించారు. సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌ డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌ ఈ పరిశోధన గురించి వివరిస్తూ.. ‘‘227 జాతులకు చెందిన 1600 మంది వ్యక్తుల జన్యు సమాచారం గతంలో విశ్లేషించాం. ఒంగే, జరావా వంటి అండమాన్‌ తెగలతో పాటూ తెలుగు రాష్ట్రాల్లో ఒక తెగ, మరికొన్ని జాతుల్లో వ్యక్తులు ఎక్కువగా ఒకేరకమైన జన్యువులను కలిగి ఉన్నారు.

వీరంతా ఒకే సమూహంలో పెళ్లిళ్లు చేసుకోవడం, జన్యు వైవిధ్యం పెద్దగా లేకపోవడంతో కొవిడ్‌తో పాటూ ఇతర ఇన్‌ఫెక్షన్లు సొకే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశాం. ఇలాంటివారు కొవిడ్‌ సంక్షోభం ముగిసేవరకు ఇతర సమూహాలను దగ్గరికి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం’ అని అన్నారు. చిన్న సమూహాలకు సంబంధించి మొదటిసారి జీనోమ్‌ డేటా ఆధారంగా ఫలితాలను విశ్లేషించామని పరిశోధనలో పాలుపంచుకున్న బీహెచ్‌యూ మాలిక్యులర్‌ ఆంత్రోపాలజీ ఆచార్యులు చౌబే అన్నారు. తాజా ఫలితాలు ఇలాంటి సమూహాలకు మరింత రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరి తెలిపారు. జీన్స్‌ అండ్‌ ఇమ్యూనిటీ ఆన్‌లైన్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని