కార్తికం ముగిసింది.. కొక్కొరొకో!

కార్తిక మాసంలో పూజలు, వ్రతాలు ప్రభావం మాంసం వినియోగంపై పడింది. దీనికితోడు పెళ్లి ముహూర్తాలు లేవు. శాకాహారంతో ఆదివారాలు వనసమారాధనలు నిర్వహించారు.

Updated : 30 Nov 2022 06:29 IST

తగ్గిన హోల్‌సేల్‌... పెరిగిన రిటైల్
ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే

కార్తిక మాసంలో పూజలు, వ్రతాలు ప్రభావం మాంసం వినియోగంపై పడింది. దీనికితోడు పెళ్లి ముహూర్తాలు లేవు. శాకాహారంతో ఆదివారాలు వనసమారాధనలు నిర్వహించారు. కేవలం ఇతర శుభకార్యాలు, సాధారణ వాడకం వల్ల కోడి మాంసం విక్రయాలు సగానికి పడిపోయాయి. మార్గశిర మాసం ప్రవేశంతో పూజలు ముగిసి కోడి మాంసం విక్రయ దుకాణాలు కళకళలాడుతున్నాయి. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో మాంసం అమ్మకాల జోరు పెరిగింది. 

ఆ నెలలో కోళ్ల లబ్ధి తక్కువగా ఉంది. దీంతో బాయిలర్‌ కోడి ధర హోల్‌సేల్‌లో కిలో రూ.117లు, రిటైల్‌లో రూ.135లుగా ఉంది. మాంసం విక్రయాలు తక్కువగా ఉండటంతో ధర తగ్గించి కిలో స్కిన్‌ రూ.200లు, స్కిన్‌లెస్‌ రూ.220లుగా ఉంది. ప్రస్తుతం కోళ్ల లభ్యత పెరిగింది. హోల్‌సేల్‌లో కిలో రూ.110లు, రిటైల్‌లో రూ.130లుగా ఉంది. హోల్‌సేల్‌లో తగ్గినా రిటైల్‌లో ధర స్వల్పంగా పెరిగింది. గత ఆదివారం కిలో రూ.240లు, స్కిన్‌ లెస్‌ రూ.260లుగా అమ్మకాలు జరిపారు. ఫారం కోడి 1.5కిలోలు ఉండేది రూ.120లుగా అమ్మకాలు జరుగుతున్నాయి. కార్తిక మాసంలో దుకాణాల నిర్వహణ ఖర్చులు దక్కించుకునేందుకు లాభం తగ్గించుకుని విక్రయాలు జరిపినట్లు దుకాణదారులు తెలిపారు. ప్రస్తుతం హోల్‌సేల్‌్ ధర తగ్గి, రిటైల్‌ విక్రయాలు పెరిగినా స్వల్పంగా ధర పెంచాల్సి వచ్చిందని చెప్పారు.

ఉభయ జిల్లాల్లో దుకాణాలు.. అమ్మకాలు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,800ల లైసెన్స్‌ కలిగిన, సుమారు వెయ్యి లైసెన్స్‌ లేని కోడి మాంసం విక్రయ దుకాణాలున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 35-40టన్నులు, ఆదివారం 80 టన్నుల కోడి మాంసం విక్రయిస్తారు. ఖమ్మం నగరంలో 180 లైసెన్సు కలిగినవి, మరో 40వరకు లైసెన్సు లేని చికెన్‌ షాపులున్నాయి. సాధారణంగా రోజుకు 10 టన్నులు, ఆదివారం 20టన్నులు అమ్ముతారు.
కార్తిక మాసంలో మాంసం విక్రయాలు సగానికి పడిపోయాయి. ప్రస్తుతం అమ్మకాలు ఆశాజనకంగా పెరిగాయి. త్వరలో శుభకార్యాలతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.
పారా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు, చికెన్‌ దుకాణ యజమానుల సంఘం, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని