జగనన్న ఇళ్లకు బీటలు

నున్నలోని జగనన్న లేఔట్‌లో ఇళ్లు బీటలు వారుతున్నాయి. ప్రభుత్వమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా.. పునాది స్థాయిలోనే వదిలేయడంతో వాటి గోడలు, పిల్లర్లు బీటలు వారుతున్నాయి.

Updated : 09 Feb 2023 06:31 IST

ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటున్న లబ్ధిదారులు
నున్న(విజయవాడ గ్రామీణం), న్యూస్‌టుడే

నున్న గ్రామీణ లేఔట్‌లో మట్టి కూడా లేకుండా పునాది దశకే పరిమితమైన ఇళ్లు

నున్నలోని జగనన్న లేఔట్‌లో ఇళ్లు బీటలు వారుతున్నాయి. ప్రభుత్వమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా.. పునాది స్థాయిలోనే వదిలేయడంతో వాటి గోడలు, పిల్లర్లు బీటలు వారుతున్నాయి. నున్న లేఅవుట్‌లోని నున్న లబ్ధిదారులు 760 మందికి, రామవరప్పాడుకు 600 మందికి ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాప్తాడు వైకాపా ఎమ్మెల్యేకు చెందిన సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. నివేశన స్థలాలు ఇచ్చిన సుమారు ఏడాది తర్వాత నాలుగు పిల్లర్లతో బెల్ట్‌గా పునాది వేశారు. అనంతరం సుమారు 5 నెలల వరకు పనులు మొదలు పెట్టలేదు. తర్వాత మళ్లీ పునాది గోడగా మూడు అడుగుల గోడ నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం 5 నెలల 20 రోజుల నుంచి అసలు ఇళ్ల నిర్మాణ పనులే ప్రభుత్వ పరంగా సాగక పోవడంతో పునాదిగా వేసిన పలు ఇళ్ల గోడలు దెబ్బతింటున్నాయి. పలు ఇళ్ల గోడలైతే ఏకంగా పడిపోయాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి తదితర గ్రామాలకు చెందిన నున్న లేఔట్‌లో ఇళ్ల నిర్మాణం పునాదుల స్థాయి దాటలేదు.

ఇళ్ల పునాదులకు పగుళ్లు

మట్టి కొరత : పునాదుల దశలో ఇంటి ఆవరణలో మట్టిని మెరకగా పోయాల్సి ఉంది. మట్టిని కూడా పోయకపోవడంతో ఎప్పటికి పనులు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని, ఈ విషయమై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

నీటి ఇక్కట్లు.: గోడలు బీటలు వారకుండా కనీసం నీటితో తడుపుకునేందుకు లబ్ధిదారులు యత్నిస్తున్నా నీటి కొరత శాపంగా మారింది. సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్న వారు సైతం నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటూ అత్యవసర సమయంలో వాటర్‌ ట్యాంకరు రూ.1500 చొప్పున కొనుగోలు చేసుకుంటున్నారు.  ప్రభుత్వ పరంగానే నిర్మించాల్సిన ఇళ్ల పరిస్థితి నీరు లేక గోడలు పగిలిపోతున్నాయి. మట్టి పోసిన తర్వాత సైతం మరింతగా పునాదులు దెబ్బతినే పరిస్థితి లేక పోలేదని పలువురు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇళ్ల నాణ్యత కూడా దెబ్బతింటుందని, తక్షణమే  పనులు వేగంగా పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని