లక్ష్యం ఘనం.. నిర్వహణ నిర్లక్ష్యం

జిల్లాలో హరితహారం కార్యక్రమంలో లక్ష్యంమేర మొక్కలు నాటినా నిర్వహణ  విస్మరించారు. వేసవిలో మొక్కలు ఎండిపోతున్నా..

Updated : 10 Jun 2023 06:06 IST

ప్రహసనంగా హరితహారం మొక్కల సంరక్షణ

వెల్దండ : బర్కత్‌పల్లి సమీపంలో ఎండిపోయిన మొక్కలు

కొల్లాపూర్‌, కల్వకుర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో హరితహారం కార్యక్రమంలో లక్ష్యంమేర మొక్కలు నాటినా నిర్వహణ  విస్మరించారు. వేసవిలో మొక్కలు ఎండిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. మొక్కల పెంపకం ప్రహసనంగా మారడంతో డబ్బులు ఖర్చవుతున్నా.. పచ్చదనం కనిపించడం లేదు.  ఈ ఏడాది వర్షాకాలంలో కూడా భారీ లక్ష్యంతో ప్రతి గ్రామపంచాయతీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అటవీశాఖ, పురపాలిక శాఖల ఆధ్వర్యంలో కూడా మొక్కల పెంపకం చేపట్టారు. ఈ సమస్యపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.
నీరందిస్తేనే ఎదుగుదల.. : హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2022-23లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 68 లక్షల మొక్కలను నాటారు. పంచాయతీలు, శివారు గ్రామాలతోపాటు ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పక్కన నాటిన మొక్కలకు కూడా నీళ్లు పోయడం లేదు. ఎల్లూరు నుంచి, అంకిరావుపల్లి, కుడికిల్ల, సింగోటం, మాచినేనిపల్లి శివారులో గ్రామాల్లో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది కూడా జిల్లాలో 47 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో వివిధ రకాల 10 వేల నుంచి 20 వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ నర్సరీల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. వారానికోసారి కనీసం నీళ్లు పోయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతంలో.. : అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సారి కూడా భారీ లక్ష్యం ఉంది. ప్రతి రేంజ్‌ పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఈ మేరకు 10 లక్షల మొక్కలు హరితహారంలో నాటడానికి చర్యలు చేపట్టారు. గతేడాది అటవీప్రాంతంలో నాటిన మొక్కలకు రక్షణ ఏర్పాట్లు లేకుండా పోయాయి. అమరగిరి, ఎర్రపెంట, సోమశిల, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో నాటిన మొక్కలు ఎదుగుదల లేదు. వారానికోసారి నీళ్లు పోయడం లేదన్న ఆరోపణలున్నాయి. కానీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో వివిధ రకాల మొక్కల ఎదుగుదల కూడా సక్రమంగా లేదు. ఇప్పటికైనా హరితహారంలో నాటిన మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


పురాల్లోనూ..

నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ పురపాలికల్లో హరితహారంలో భాగంగా ఒక్కో పట్టణంలో లక్ష నుంచి లక్షన్నర మొక్కలను నాటారు. పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. పట్టణాల్లోని ప్రధాన రోడ్లలో మొక్కల నిర్వహణ ఉన్నా.. శివారు కాలనీలు, విలీన గ్రామాల్లో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. కొల్లాపూర్‌ పట్టణంలో సోమశిలకు వెళ్లే దారిలో వరిదేల చెరువుకట్టపై నాటిన మొక్కలకు నీళ్లు పోయడం లేదు. ఎండుముఖం పట్టాయి. చుక్కాయిపల్లి, చౌటబెట్ల గ్రామాల్లోనూ మొక్కల సంరక్షణ మరిచారు. మిగతా మూడు పురపాలికల్లో కూడా శివారు కాలనీలో మొక్కల నిర్వహణ సక్రమంగా లేదని విమర్శలు వస్తున్నాయి.


అధికారులు ఏమన్నారంటే..

గ్రామాల్లో మొక్కలు ఎదిగేలా వారానికోసారి నీళ్లు పోస్తున్నట్లు డీఆర్‌డీఏ జిల్లా పీడీ నర్సింగరావు చెప్పారు. గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి ప్రతి గ్రామపంచాయతీలో హరితహారంలో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచుతున్నామన్నారు.

* అటవీశాఖ పరిధిలో నాటిన మొక్కలను పరిరక్షించడానికి చర్యలు చేపట్టినట్లు కొల్లాపూర్‌ రేంజర్‌ శరత్‌చంద్రారెడ్డి చెప్పారు. ఎండిపోయిన మొక్కలను తొలగించి మళ్లీ మొక్కలు నాటడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి కూడా నర్సరీలు ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలను పెంచుతున్నట్లు రేంజర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని