Hyderabad: ప్యాసింజర్‌ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు

కరోనాకు ముందు అంటే 2017లో దక్షిణమధ్య రైల్వేలో 745 రైళ్లు నడిచేవి. ఇందులో 354 పాసింజర్‌ రైళ్లు కాగా.. 270 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు. ప్రస్తుతం కొత్త మార్గాలు వచ్చాయి.

Updated : 23 Sep 2023 08:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనాకు ముందు అంటే 2017లో దక్షిణమధ్య రైల్వేలో 745 రైళ్లు నడిచేవి. ఇందులో 354 పాసింజర్‌ రైళ్లు కాగా.. 270 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు. ప్రస్తుతం కొత్త మార్గాలు వచ్చాయి. విద్యుదీకరణ జరిగింది. రైళ్ల వేగం పెరిగింది. ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించిన దక్షిణమధ్య రైల్వే.. ప్రయాణికులను తీసుకెళ్లడంలో మాత్రం వెనుకబడిపోయింది. కరోనా తర్వాత లెక్కలన్నీ తప్పాయని సరిపెట్టుకున్నా.. ప్రస్తుతం అంతటా సాధారణ స్థితి నెలకొంది. దీనికి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగాల్సింది పోయి.. తగ్గిపోయాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మాట అటుంచితే.. పాసింజర్‌ రైళ్లు చాలావరకు తగ్గిపోయాయి.

రైతులకు దక్కని భరోసా.. మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌కు సరైన సమయపాలనతో డెమూ, మెమూ రైళ్లు నడిచేవి.  నగరం నుంచి వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కర్నూలు, గుంటూరు, వరంగల్‌కు విరివిగా పాసింజర్‌ రైళ్లు నడిచేవి. ఇప్పుడవేవీ కనిపించడం లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు రైలు భరోసా లేకుండా పోయింది. ముఖ్యంగా నగరం నుంచి మేడ్చల్‌, ఉందానగర్‌ వెళ్లే పాసింజర్లన్నీ కనుమరుగయ్యాయి. 10 ఎంఎంటీఎస్‌లు నడుపుతున్నా.. అవి సమయపాలన పాటించక ఇబ్బందులు పడుతున్నారు. ద.మ. రైల్వే పరిధిలో 2000 సంవత్సరం వరకూ 47 డెమూ రైళ్లు మేడ్చల్‌-సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మధ్య నడిచేవి. 2015కు వచ్చేసరికి 25కు కుదించారు. ఇలా 2017 వరకూ వీటిని 16కు తగ్గించారు.  

అనువుగాని వేళ.. మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మధ్య 10 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుపుతున్నా అవేవీ ఉద్యోగులకు అనువైన సమయాలు కాకపోవడం గమనార్హం. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సమయపాలన పాటించి నడిపితే ఊరట ఉండేది. నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్‌ రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రతి అరగంటకో ఎంఎంటీఎస్‌ నడపాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని