Balineni Srinivasa Reddy: బాలినేని వ్యాఖ్యలతో ప్రకంపనలు

తమకు సీఎం జగన్‌పై పిచ్చి ప్రేమ ఉన్నా... ఆయనకూ మాపై ఉండాలి కదా’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచాయి.

Updated : 11 Dec 2023 10:30 IST

సామాజిక మాధ్యమాల్లోనూ విశ్లేషణలు
సీఎంవో జోక్యంతో వివరణ ఇచ్చుకున్న మాజీ మంత్రి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘తమకు సీఎం జగన్‌పై పిచ్చి ప్రేమ ఉన్నా... ఆయనకూ మాపై ఉండాలి కదా’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచాయి. వైకాపా నాయకులు సైతం ఉలిక్కిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని రూ.50 లక్షలు పందెం కాశాననీ... బీఆర్‌ఎస్‌ గెలవాలన్న తన కుమారుడి ఆకాంక్షతో దాన్ని వెనక్కు తీసుకున్నానని చెప్పడమూ కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తావించిన పలు అంశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.

అంటీముట్టనట్లుగా...

2019 ఎన్నికలకు ముందు వరకు బాలినేని అంతగా వార్తల్లో నిలిచిన వ్యక్తి కాదు. వైకాపా (YSRCP) అధికారంలోకి వచ్చి రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితిలో మార్పు వచ్చింది. మంత్రివర్గ విస్తరణలో పాతవాళ్లను కొనసాగించరనీ... అంతా కొత్తవాళ్లకే అవకాశం ఇస్తారని తొలుత ప్రకటించింది ఆయనే. అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనను తప్పించి జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్ఠానంపై అలకబూనడంతో... ప్రభుత్వ సలహాదారు సజ్జల బృందం సంప్రదింపులు, బుజ్జగింపులు చేయడంతో వార్తల్లోకెక్కారు. ఆ తరువాత విజయవాడ నుంచి ఒంగోలు వచ్చే క్రమంలో ఆయన నిర్వహించిన బల ప్రదర్శన సైతం రాష్ట్రంలో చర్చకు తావిచ్చింది. అప్పటి నుంచీ జిల్లాలోని సహచర నాయకులతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. బావమరిది, తితిదే మాజీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డితోనూ పొసగటం లేదు. పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పదేపదే ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఆయన జోక్యం వద్దని సమయం వచ్చినప్పుడల్లా పట్టుబడుతున్నారు.

వరుసగా వివాదాలు...

మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆయన అన్యమనస్కంగానే ఉన్నారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవి ఇచ్చినా... అందులో ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేక రాజీనామా చేశారు. ఒంగోలులో తన పనేదో తాను చేసుకుంటానని పార్టీకి ఆల్టిమేటం జారీ చేసి వార్తల్లో నిలిచారు. మార్కాపురంలో సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్‌ వివాదంతో పార్టీలో అంతర్గత విభేధాలు మరోస్థాయికి చేరాయి. మంత్రి సురేష్‌ కాన్వాయ్‌ను లోపలికి అనుమతించి... ఆయనను వాహనం దిగి నడిచి వెళ్లాలని పోలీసులు సూచించడంతో మరింత రగిలిపోయారు. యంత్రాంగంపై అలకబూని సీఎం సభకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. చివరకు ముఖ్యమంత్రి జోక్యంతో సభకు వచ్చారు. తాజాగా ఒంగోలు భూ కుంభకోణంలో సిట్‌ దర్యాప్తు తాను చెప్పిన విధంగా జరగడం లేదని... తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని వెనక్కు పంపి అలకపాన్పు ఎక్కారు. అప్పట్లో ఈ వ్యవహారమూ చర్చనీయాంశమైంది. ఆయన అనుచరులు భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంపైనా నిరసన స్వరం వినిపించారు. ఫ్లెక్సీలో తన ఫొటోలు లేవంటూ కనిగిరిలో సామాజిక సాధికార బస్సుయాత్రకు దూరంగా ఉన్నారు.

తాజా వ్యాఖ్యలతో దుమారం..

గతంలో... తాను పేకాట ఆడతాననీ, కాసినోలకు వెళ్తానని మీడియా ముఖంగానే వెల్లడించి కలకలం రేపారాయన. తాజాగా తెలంగాణ ఎన్నికలపై పందెం కాశానని, మంత్రిగా ఉంటూ ఖర్చులకు డబ్బులు తీసుకున్నాననీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ అంటే మాకు పిచ్చి ప్రేమ ఉన్నా... ఆయనకు మాపై ఉండాలిగా అని వ్యాఖ్యానించి అలజడి సృష్టించారు. ఒక సీనియర్‌ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు పెట్టాననడం, మంత్రిగా డబ్బులు తీసుకున్నానని బహిరంగంగా చెప్పడం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. సామాజిక మాధ్యమాల్లో ఆయన వ్యాఖ్యలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ విషయమై సీఎంవో స్పందించటంతో... ఆదివారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడి... ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తాననీ, సీఎం జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించి తన విధేయతను చాటుకునే ప్రయత్నం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని